Satya Nadella: హైబ్రిడ్‌ వర్క్‌, డిజిటలైజేషన్‌.. భవిష్యత్తులో ఇవే కీలకమన్న సత్య నాదెళ్ల

12 Jan, 2022 11:19 IST|Sakshi

ఫ్యూచర్‌ రెడీ సదస్సులో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 

న్యూఢిల్లీ: ఉద్యోగులు ఎప్పటి నుంచి కార్యాలయాలకు రావాలనే విషయంలో స్పష్టమైన విధానం అంటూ ఏదీ రూపొందించుకోలేదని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదేళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఫ్యూచర్‌ రెడీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అనేక అంశాలపై ఆయన స్పందించారు. క్లిష్టపరిస్థితుల్లో ఆఫీసులకు రావడం ఎందుకనే భావన ఉద్యోగుల్లో నెలకొంది. 73 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు పలు సర్వేల్లో తేలింది. ఆఫీస్‌ వర్క్‌ ఒత్తిడి పెరిగితే ఉద్యోగులు కంపెనీలు మారేందుకు వెనుకాడటం లేదు. గతంలోనే ఉన్నడూ లేనంతగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఉద్యోగుల ఆందోళన పరిగణలోకి తీసుకుని ప్లెక్లిబులిటీ ఉండే హైబ్రిడ్‌ పని విధానం వైపు మైక్రోసాఫ్ట్‌ మొగ్గిందని ఆయన తెలిపారు.

టెక్నాలజీతో ఉత్పాదకత పెంపు 
టెక్నాలజీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వివిధ స్థాయుల్లోని వ్యాపార సంస్థలు తమ ఉత్పాదకతను మరింతగా పెంచుకోవచ్చని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తద్వారా తమ ఉత్పత్తులు, సర్వీసులను చౌకగా అందించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు డిజిటల్‌ బాట పడుతున్నాయని ఆయన వివరించారు. హైబ్రిడ్‌ పని ధోరణి పెరుగుతోందని, వ్యాపారాలు మరింత లోతుగా అనుసంధానమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య విశ్వసనీయమైన సంబంధాలు నెలకొనాలంటే ఎల్లలు లేని డిజిటల్‌ వ్యవస్థ అవసరం అవుతుందని నాదెళ్ల తెలిపారు.  ‘ద్రవ్యోల్బణం పెరిగే ఆర్థిక వ్యవస్థలో.. ధరలను కట్టడి చేసే శక్తి డిజిటల్‌ టెక్నాలజీకి ఉంది. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు టెక్నాలజీ ఊతంతో తమ ఉత్పత్తులు, సర్వీసుల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. చౌకగా అందించవచ్చు‘ అని నాదెళ్ల పేర్కొన్నారు.    

చిప్‌ల డిజైనింగ్‌లో అవకాశాలు: చంద్రశేఖర్‌ 
వచ్చే 5–7 ఏళ్లలో సెమీకండక్టర్‌ డిజైన్, ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ డిజైన్, ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల్లో భారత్‌ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి ఆర్‌. చంద్రశేఖర్‌ చెప్పారు. కంప్యూటింగ్‌కు సంబంధించి రాబోయే రోజుల్లో ఇవి కీలకంగా ఉండనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కంపెనీల్లో టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ వినియోగించడం మరింతగా పెరిగిందని ఫ్యూచర్‌ రెడీ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. వ్యాపార సంస్థలు ఉత్పాదకత పెంచుకోవడానికి, నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, పోటీ పడటానికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు.

మరింత పటిష్టంగా భారత్‌ వృద్ధి: టీసీఎస్‌ చంద్రశేఖరన్‌ 
భారత్‌ దీర్ఘకాల వృద్ధి గతిపై కరోనా మహమ్మారి ప్రభావం పెద్దగా లేదని దేశీ దిగ్గజం టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ చెప్పారు. కొన్ని ప్రాథమిక అంశాల కారణంగా కాస్త జాప్యం మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్‌ తర్వాత ఎకానమీ పూర్తి స్థాయిలో పుంజుకున్నాక.. ఈ దశాబ్దంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసే దేశాల్లో భారత్‌ ముందు ఉంటుందని చెప్పారు.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 2022.. నచ్చిన చోట నుంచి పనిచేసే వెసులుబాటు!

మరిన్ని వార్తలు