సగం మైక్రోసాఫ్ట్‌ షేర్లు అమ్మేసుకున్న సత్య నాదెళ్ల, కారణం ఏంటంటే..

30 Nov, 2021 16:40 IST|Sakshi

టెక్‌ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల కంపెనీలో తన పేరిట ఉన్న సగం షేర్లను అమ్మేసుకున్నారు. 


సుమారు 285 మిలియన్‌ డాలర్ల విలువైన 8,38,584 షేర్లను గత వారమే సత్య నాదెళ్ల అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తిగా వ్యక్తిగత కారణాలతో ఆయన షేర్లను అమ్మేసుకున్నారని మైకక్రోసాఫ్ట్‌ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉంటే మైకోసాఫ్ట్‌ ధరలు కొంతకాలంగా యూఎస్‌ స్టాక్‌ మార్కెట్‌లో స్వల్ఫ క్షీణతను చవిచూస్తున్నాయి.  ఈ పరిణామాల తర్వాత సీఈవో హోదాలో సత్య నాదెళ్ల తన షేర్లను అమ్మేసుకోవడం విశేషం. 

అందుకేనా..
ఇదిలా ఉంటే వివాదాస్పద ‘క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌’ నేపథ్యంలోనే నాదెళ్ల షేర్లు అమ్మేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ చట్టం ప్రకారం.. దీర్ఘకాలిక క్యాపిల్‌ గెయిన్స్‌ 2,50,000 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే.. వాళ్లు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్టాక్‌, బిజినెస్‌ ఓనర్‌షిప్‌ అమ్మకాల మీద ఏడు శాతం ట్యాక్స్‌ విధిస్తుంది ప్రభుత్వం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‘సోషల్‌ స్పెండింగ్‌ ప్లాన్‌’ కోసం సెనేటర్లు ఒక ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం..  స్టాక్స్‌ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేయొచ్చు.

 

జనవరి 1, 2022 నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సత్య నాదెళ్ల షేర్లు అమ్మేసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. కానీ, మైక్రోసాఫ్ట్‌ మాత్రం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో భాగంగానే ఆయన అమ్మేసుకున్నట్లు చెబుతోంది. సత్య నాదెళ్ల మాత్రమే కాదు.. ఎలన్‌ మస్క్‌ లాంటి బిలియనీర్లు సైతం కొత్త చట్టం ఎఫెక్ట్‌తో షేర్లను(టెస్లా షేర్లు) అమ్మేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. నవంబర్‌ 22, 23వ తేదీల్లో షేర్ల అమ్మకానికి సంబంధించిన ట్రాన్‌జాక్షన్స్‌ జరిగినట్లు తెలుస్తోంది. తాజా షేర్ల అమ్మకంతో ప్రస్తుతం ఆయన దగ్గర మైక్రోసాఫ్ట్‌కి సంబంధించి 8,30,791 షేర్లు మాత్రమే ఉన్నాయి.

చదవండి: ఎలన్‌ మస్క్‌ షేర్ల అమ్మకం.. ఫలితం ఇదే!

మరిన్ని వార్తలు