రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు

23 Sep, 2021 20:15 IST|Sakshi

పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ ఇటు బ్యాంకులు, అటు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారుల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తుంటే, బ్యాంకులు గృహ, వ్యక్తిగత, కారు, బంగారం రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు పండుగ ఆఫర్ల వర్షం కురిపించింది. గృహ రుణం, కారు రుణం, బంగారు రుణం, వ్యక్తిగత రుణంపై అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. 

ఇటీవల ఎస్‌బీఐ చేసిన ఒక ట్వీట్‌లో కారు, బంగారం, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన ఆఫర్ల గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్‌లో "కారు రుణం, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ పై ఎస్‌బీఐ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లతో పండుగ వేడుకలను ప్రారంభించండి. ఈ రోజు ప్రారంభించండి!" అని పేర్కొంది. కారు రుణాన్ని లక్షకు రూ.1539, బంగారు రుణాన్ని 7.5 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాన్ని లక్షకు రూ.1832 ఈఎంఐకే అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. (చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!)

అలాగే, త్వరలో రాబోయే పండుగ సీజన్​ దృష్టిలో పెట్టుకొని గృహ రుణాలపై ఆఫర్లను ప్రకటించింది. అత్యధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్‌ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నవారికి 45 బేసిస్‌ పాయింట్ల(100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు.  
 

మరిన్ని వార్తలు