ఎస్‌బీఐ పరిస్థితి భేష్‌

29 Jan, 2021 06:24 IST|Sakshi

చైర్మన్‌ దినేశ్‌ ఖారా స్పష్టీకరణ

బ్యాలెన్స్‌ షీట్‌పై ప్రతికూలతలు మరింత తగ్గే అవకాశం

అంచనాలకు మించి రికవరీనే కారణం

ముంబై: బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణ నాణ్యత బాగుందని చైర్మన్‌ దినేశ్‌ ఖారా గురువారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో అంచనాలకు మించి జరుగుతున్న రికవరీ– బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌ లో ప్రతికూలతలను పరిమిత స్థాయిలోనే కట్టడి చేయడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అయితే కోవిడ్‌–19కు సంబంధించి రుణ పునర్‌ వ్యవస్థీకరణ సంబంధ అంశాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించలేదు. త్వరలో ప్రకటించనున్న బ్యాంక్‌ డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలే దీనికి కారణమని పేర్కొన్నారు. భారత్‌ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల భారం తీవ్రతరం కానుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవలే విడుదల చేసిన ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌) పేర్కొంది.

ఎన్‌పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్‌ నాటికి 13.5 శాతానికి చేరుతుందని, ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని నివేదిక వివరించింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మొండి బకాయిలు 2021 సెప్టెంబర్‌ నాటికి కనీస స్థాయిలో చూసినా 9.7 శాతం– 16.2 శాతాల శ్రేణిలో ఉండే వీలుందని తెలిపింది. తీవ్ర స్థాయిల్లో పీఎస్‌బీల ఎన్‌పీఏలు 17.6 శాతం పెరిగే అవకాశమూ లేకపోలేదని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ రుణ నాణ్యతపై ఖరా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూస్తే...

► ఎకానమీకి సంబంధించి ఏప్రిల్‌లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో అన్ని రంగాల్లో రికవరీ ప్రక్రియ ఊపందుకుంది.

► ఒక దశలో దేశ ఆర్థిక రంగానికి సంబంధించి కీలక విభాగాలు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కార్పొరేట్లకు నగదు లభ్యతపై సైతం ఆందోళన నెలకొంది. ఇప్పుడు పరిస్థితులు వేగంగా కుదుటపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ఇందుకు కారణం.

► కోవిడ్‌–19 రోగులకు ఉత్తమ చికిత్స, వ్యాక్సినేషన్‌ ఊపందుకోవడం వంటి అంశాలు ఆర్థిక రికవరీని వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతున్నాయి.

► ప్రస్తుత కీలక తరుణంలో బ్యాంకులు రుణ గ్రహీతకు అవసరమైన సలహాలను అందించాలి.

►  బడ్జెట్‌ అంచనాలపై ఇప్పుడే చేసే వ్యాఖ్య ఏదీ లేదు. ప్రభుత్వంతో జరిగిన సమావేశాల్లో మా అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది.

600 మిలియన్‌ డాలర్ల బాండ్‌ ఇష్యూ లిస్టింగ్‌
అంతక్రితం ఇండియా ఐఎన్‌ఎక్స్‌ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ (జీఎస్‌ఎం) ప్లాట్‌ఫామ్‌పై ఎస్‌బీఐ 600 మిలియన్‌ డాలర్ల ఫారిన్‌ కరెన్సీ బాండ్‌ ఇష్యూ లిస్టింగ్‌ కార్యక్రమంలో ఖరా పాల్గొన్నారు. తన 10 బిలియన్‌ డాలర్ల గ్లోబల్‌ మీడియం టర్మ్‌ నిధుల సమీకరణ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్‌ లండన్‌ బ్రాంచ్‌ తాజా ఇష్యూ లిస్ట్‌ చేసింది. బాండ్‌ కూపన్‌ రేటు 1.80 శాతం. 2008 తర్వాత ఇంత తక్కువ కూపన్‌ రేటు ఇదే తొలిసారి. ఇండియా ఐఎన్‌ఎక్స్‌పై భారీగా ఫారిన్‌ కరెన్సీ ఇష్యూ చేస్తున్న జాబితాలో ఎస్‌బీఐ ఒకటి. తాజా లిస్టింగ్‌తో కలిపి దాదాపు 2.6 బిలియన్‌ డాలర్ల బాండ్లను బ్యాంక్‌ ఇప్పటికి లిస్ట్‌ చేసింది. తద్వారా నిధుల సమీకరణ బ్యాంకుకే కాకుండా, భారత్‌ ఆర్థిక వ్యవస్థలోనూ విశ్వాసాన్ని నింపుతుందని గురువారం కార్యక్రమం సందర్భంగా ఖరా అన్నారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ఎస్‌బీఐ చాటి చెబుతోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు