SBI Card Tokenisation: కరోనా తర్వాత ఆన్‌లైన్‌ వైపే మొగ్గు  

2 Sep, 2022 10:33 IST|Sakshi

క్రెడిట్‌ కార్డుల వినియోగంలో మారిన ధోరణులు 

ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ రామ్మోహన రావు అమర వెల్లడి 

క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డ్‌ ఆవిష్కరణ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ తర్వాత పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపే ధోరణి గణనీయంగా పెరిగిందని ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈవో రామ్మోహన్‌ రావు అమర తెలిపారు. తమ క్రెడిట్‌ కార్డుదారుల లావాదేవీల్లో దాదాపు 55 శాతం పైగా ఇవే ఉంటున్నాయని ఆయన వివరించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కార్డుల వినియోగం, సగటున కార్డుపై చేసే వ్యయాలు భారీగా ఉంటోందని రామ్మోహన రావు తెలిపారు. సాధారణంగా జూన్‌ త్రైమాసికం కాస్తంత డల్‌గా ఉంటుందని, కానీ ఈసారి కార్డుల ద్వారా ఖర్చు చేసే ధోరణి గణనీయంగా పెరిగిందని చెప్పారు. రాబోయే పండుగ సీజన్‌లో కూడా ఇదే ధోరణి కనిపించవచ్చని ఆశిస్తున్నట్లు రామ్మోహన్‌ రావు తెలిపారు.

కొత్తగా క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డును ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్‌ బ్యూరోకు ఆయన ఈ విషయాలు వివరించారు. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు చెప్పారు. కార్డుల వినియోగ ప్రయోజనాలను తర్వాత ఎప్పుడో అందుకోవడం కాకుండా తక్షణం లభించాలని వినియోగదారులు కోరుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కేవలం ఒక విక్రేతకు మాత్రమే పరిమితం కాకుండా ఆన్‌లైన్‌లో చేసే కొనుగోళ్లన్నింటికీ సంబంధించి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చని పేర్కొన్నారు. తదుపరి బిల్లింగ్‌ స్టేట్‌మెంట్‌లో ఇది ప్రతిఫలిస్తుందని వివరించారు. క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలకు నెలకు రూ. 10,000 మేర గరిష్ట పరిమితి ఉంటుందని రామ్మోహన్‌ రావు చెప్పారు. అటుపైన కూడా తగు స్థాయిలో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ తరహా కార్డును ఆవిష్కరించడం దేశీయంగా ఇదే తొలిసారని చెప్పారు ప్రత్యేక ఆఫర్‌ కింద 2023 మార్చి వరకూ దీన్ని ఎటువంటి చార్జీలు లేకుండా పొందవచ్చు. 

టోకెనైజేషన్‌కు ఎస్‌బీఐ కార్డ్‌ రెడీ 
వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం, ఏదైనా డేటా లీకేజీకి వ్యతిరేకంగా భరోసా ఇవ్వడం పరంగా టోకెనైజేషన్‌ విధానం మెరుగైనదని రామ మోహన్‌ రావు  తెలిపారు. పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ సాంకేతికతను అమలు చేస్తున్నాయని అక్టోబర్‌ నుండి ఈ విధానం ఎస్‌బీఐ కార్డ్‌ అమలు చేస్తుందని వెల్లడించారుకాగా, ఆన్‌లైన్‌ లేదా దుకాణాల్లో చెల్లింపుల సమయంలో కస్టమర్‌ తన కార్డు వివరాలు ఇవ్వవలసిన అవసరం ఉండదు. స్మార్ట్‌ఫోన్‌ సహకారంతో డిజిటల్‌ టోకెన్‌ రూపంలో లావాదేవీ పూర్తి చేయవచ్చు. ప్రతి లావాదేవీకి టోకెన్‌ మారుతుంది. ఇది పూర్తిగా సురక్షితం. సైబర్‌ మోసానికి, డేటా చోరీకి ఆస్కారం లేదు.  

మరిన్ని వార్తలు