వామ్మో! ఎస్‌బీఐ ఛార్జీల రూపంలో ఇంత వసూలు చేసిందా?

11 Apr, 2021 19:54 IST|Sakshi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ)తో సహా పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్(బిఎస్‌బిడిఎ) ఖాతాదారులకు అందించే కొన్ని సేవలపై అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. బీఎస్‌బిడిఎ ఖాతాదారులు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీ నుంచి రూ.17.70 వసూలు చేయాలని ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని"సహేతుకమైనది"గా పరిగణించ లేమని అధ్యయనం పేర్కొంది. సేవా ఛార్జీలు విధించడం వల్ల 2015-20 మధ్య కాలంలో ఎస్‌బిఐ దాదాపు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(బీఎస్‌బిడిఎ) హోల్డర్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది.

అలాగే, ఎస్‌బీఐ తర్వాత ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇదే సమయంలో 3.9 కోట్ల బీఎస్‌బిడిఎ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు వసూలు చేసింది. "కొన్ని బ్యాంకులు బీఎస్‌బిడిఎలపై గల ఆర్బిఐ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఎస్‌బీఐ గరిష్ట సంఖ్యలో బీఎస్‌బిడిఎలను నిర్వహిస్తుంది. ప్రతి డెబిట్ లావాదేవీపై(డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. 2018-19 కాలంలో రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు” ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. 2013 సెప్టెంబర్ ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఎస్‌బీడిఎపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. 

ఎస్‌బీఐ, 2013 నాటి నుంచి ఆర్బిఐ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ నెలకు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై బీఎస్‌బీడిఎ హోల్డర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంది. నెఫ్ట్, ఐఎంపిఎస్ వంటి డిజిటల్ లావాదేవీలపై కూడా ఛార్జీలు రూ.17.70 వసూలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. "ఒక వైపు ప్రభుత్వం దేశంలో డిజిటల్ చెల్లింపు మార్గాలను గట్టిగా ప్రోత్సహిస్తుంటే. మరోవైపు, ఎస్‌బీఐ ఖాతాదారులను నిరుత్సాహపరుస్తుంది" అని ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది.

చదవండి: రెమిడెసివర్‌ ఎగుమతులపై కేంద్రం నిషేధం!

మరిన్ని వార్తలు