మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు డిమాండ్‌, రంగంలోకి దిగిన ఎస్‌బీఐ!

15 Apr, 2022 20:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ విభాగంలో డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి వ్యాపార అవకాశాలు దక్కించుకోవడంపై ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దృష్టి సారించింది. వీటిపై అధ్యయనం చేసి, తగు సూచనలు చేసేందుకు కన్సల్టెంటును నియమించుకోనుంది.

 ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం దరఖాస్తు చేసుకునే సంస్థకు .. పేమెంట్‌ సిస్టమ్స్‌ విషయంలో కన్సల్టింగ్‌ సర్వీసులు అందించడంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రెండేళ్ల పాటు లాభాల్లో ఉండాలి.

 గరిష్టంగా నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. బిడ్ల దాఖలుకు మే 10 ఆఖరు తేది. ఈ ఏడాది మార్చి మధ్య నాటికి దేశవ్యాప్తంగా 10.60 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు నమోదయ్యాయి. 1,742 పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు పని చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు