ఇన్వెస్ట్‌ చేస్తున్నారా? ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌తో లాభాలే..లాభాలు

3 Oct, 2022 07:31 IST|Sakshi

పెట్టుబడులకు వైవిధ్యం అవసరమని నిపుణులు చెబుతుంటారు. పెట్టుబడులు అన్నింటినీ ఒకే విభాగంలో (ఈక్విటీ లేదా డేట్‌ లేదా గోల్డ్‌ తదితర) ఇన్వెస్ట్‌ చేసుకోకపోవడం మాదిరే.. ఈక్విటీ పెట్టుబడులు అన్నింటినీ మన దేశానికే పరిమితం చేసుకోకుండా అంతర్జాతీయ స్టాక్స్‌కు కూడా కొంత పెట్టుబడులు కేటాయించాలన్నది నిపుణుల సూచన. ఈ రకంగా చూస్తే, యూఎస్, మన భారత కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు కొన్ని ఉన్నాయి. దేశ, విదేశీ స్టాక్స్‌ కలయికతో మెరుగైన రాబడులను ఇస్తున్న పథకాల నుంచి ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు.  

ప్రతికూలతలు 
అమెరికా ప్రస్తుతం మాంద్యం ముంగిట ఉంది. అక్కడి ఈక్విటీలు మన మార్కెట్లతో పోలిస్తే అధిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడులకు మార్కెట్‌ దిద్దుబాట్లు ఎప్పుడూ మంచి అవకాశాలని నిపుణులు చెబుతుంటారు. మాంద్యం దీర్ఘ కాలం పాటు కొనసాగే పరిస్థితులు లేనందున ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలకు కొంత యూఎస్‌ ఎక్స్‌పోజర్‌ జత చేసుకోవడం దీర్ఘకాలంలో అనుకూలం అవుతుంది. ఈ లక్ష్యాలతోనే పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీక్యాప్, ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ, యాక్సిస్‌ గ్రోత్‌ అపార్చునిటీస్, కోటక్‌ పయనీర్‌ పనిచేస్తున్నాయి.  

పెట్టుబడుల విధానం 
పెట్టుబడుల పరంగా ఇవి వైవిధ్యాన్ని అనుసరిస్తున్నాయి. ఇందులో కోటక్‌ పయనీర్‌ అన్నది థీమాటిక్‌ ఫండ్‌ కిందకు వస్తుంది. వీటిల్లో ఎస్‌బీఐ ఫోకస్డ్, పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీక్యాప్‌ పథకాలకు దీర్ఘకాల చరిత్ర ఉంది. యాక్సిస్‌ గ్రోత్‌ అపార్చునిటీస్‌ నాలుగేళ్లుగా పనిచేస్తోంది. కోటక్‌ పయనీర్‌ ఆరంభమై మూడేళ్లు పూర్తి కాలేదు. కనుక ఏడాది కాల ట్రాక్‌ రికార్డు కలిగి ఉంది. ఇవన్నీ కూడా విదేశీ స్టాక్స్‌కు 14–30 శాతం మధ్య కేటాయింపులు చేసి (2022 జనవరి నాటికి) ఉన్నాయి. సెబీ పెట్టిన విదేశీ పెట్టుబడుల పరిమితి ముగియడంతో ఆ తర్వాత తాజా పెట్టుబడులకు అవకాశం లేకపోయింది. విదేశీ ఈక్విటీల పతనంతో తిరిగి కొన్ని పథకాలు పెట్టుబడులను స్వీకరిస్తున్నాయి. ఈ నాలుగు పథకాలు పెట్టుబడులకు వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయి.


ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ మూడు లేదా నాలుగు యూఎస్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంటుంది. పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీక్యాప్‌ 6–8 విదేశీ స్టాక్స్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు కొంత మేర తగ్గించుకుంది. పోర్ట్‌ఫోలియో పరంగా 10 శాతం నగదు కలిగి ఉంది. మంచి ఆకర్షణీయమైన అవకాశాలు వస్తే పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. యాక్సిస్‌ గ్రోత్‌ అపార్చునిటీస్‌ అయితే 20కు పైగా విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతోంది. సాధారణంగా మార్కెట్‌ వ్యాల్యూషన్ల ఆధారంగా ఆయా స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించుకుంటూ, పెంచుకుంటూ ఉంటాయి. ప్రస్తుతానికి ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఫండ్‌ సైతం 7 శాతం నగదు నిల్వలు కలిగి ఉంది. 

రాబడులు 
ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఫండ్‌లో ఏడాది కాల రాబడులు మైనస్‌ 3 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షికంగా 16.65 శాతం, ఐదేళ్లలో 14 శాతం, ఏడేళ్లలోనూ 14 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడినిచ్చింది. పరాగ్‌ పారిఖ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఏడాది కాలంలో 5 శాతం నష్టాన్నిచ్చింది. కానీ మూడేళ్లలో 24 శాతం, ఐదేళ్లలో 17 శాతం, ఏడేళ్లలో 17.48 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. యాక్సిస్‌ గ్రోత్‌ అపార్చునిటీస్‌ ఏడాది కాలంలో 4 శాతం నష్టాన్నివ్వగా, మూడేళ్లలో వార్షికంగా 21 శాతం చొప్పున ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. కోటక్‌ పయనీర్‌ ఫండ్‌ ఏడాది కాలంలో 5.60 శాతం మేర నష్టాన్నిచ్చింది. గత ఏడాది కాలంగా అమెరికా మార్కెట్లు కుదేలవుతున్నందున ఇన్వెస్టర్లు దీర్ఘకాల రాబడులను ప్రామాణికంగా తీసుకోవడం సరైనది అవుతుంది.

మరిన్ని వార్తలు