డిజిటల్‌ మోసాలతో జాగ్రత్త..

26 Apr, 2022 04:08 IST|Sakshi

ఖాతాదారులకు ఎస్‌బీఐ సూచనలు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులను హెచ్చరించింది. ఇందుకోసం పాటించతగిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరికీ ఎప్పుడూ పాస్‌వర్డ్‌లు వెల్లడించరాదని, తమ పరికరాల్లో ’ఆటో సేవ్‌’, ’రిమెంబర్‌ (గుర్తుపెట్టుకో)’ ఆప్షన్లను డిజేబుల్‌ చేయడం ద్వారా డివైజ్‌లో కీలక వివరాలు ఉండకుండా చూసుకోవాలని సూచించింది.

ఖాతాదారులు తమ డిజిటల్‌ బ్యాంకింగ్, డిజిటల్‌ లావాదేవీలు, ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు, సోషల్‌ మీడియా సెక్యూరిటీకి సంబంధించి అన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలని ఎస్‌బీఐ పేర్కొంది. సంక్లిష్టమైన, విశిష్టమైన పాస్‌వర్డ్‌ ఉపయోగించాలని, తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. ‘ఎన్నడూ మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు లేదా పిన్‌ నంబర్లను డివైజ్‌లో భద్రపర్చుకోవడం లేదా రాసిపెట్టుకోవడం, ఎవరికైనా చెప్పడం లాంటివి చేయొద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బ్యాంక్‌ ఎన్నడూ మీ యూజర్‌ ఐడీ/పాస్‌వర్డ్‌లు/కార్డ్‌ నంబరు/పిన్‌/సీవీవీ/ఓటీపీ వంటి వివరాలు అడగదు‘ అని ఎస్‌బీఐ పేర్కొంది. మార్గదర్శకాల్లో మరిన్ని..

► ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భద్రత కోసం బ్యాంక్‌ వెబ్‌సైట్‌ అడ్రెస్‌లో ’https’ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్‌ వై–ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించవద్దు. లావాదేవీ పూర్తయిన వెంటనే లాగ్‌ అవుట్‌ అవ్వాలి. బ్రౌజర్‌ను మూసివేయాలి.
► యూపీఐ లావాదేవీలకు సంబంధించి మొబైల్‌ పిన్, యూపీఐ పిన్‌ వేర్వేరుగా ఉండేలా
చూసుకోవాలి.
► గుర్తు తెలియని యూపీఐ అభ్యర్థనలకు స్పందించవద్దు. ఇలాంటి వాటిని తక్షణమే బ్యాంకు దృష్టికి తీసుకురావాలి. నగదును పంపేందుకు మాత్రమే పిన్‌ అవసరం, అందుకునేందుకు అవసరం లేదని గుర్తుంచుకోవాలి.  
► కస్టమర్లు తమకు తెలియకుండా ఏదైనా లావాదేవీ జరిగిందని గుర్తిస్తే వెంటనే తమ ఖాతా నుండి యూపీఐ సర్వీసును డిజేబుల్‌ చేయాలి.
► ఏటీఎం మెషీన్లు, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ డివైజ్‌ల దగ్గర లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి.
► ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు, పీవోఎస్, ఏటీఎం మెషీన్లలో లావాదేవీలకు సంబంధించి పరిమితులు సెట్‌ చేసి ఉంచుకోవాలి.
► మొబైల్‌ బ్యాంకింగ్‌ సెక్యూరిటీ విషయానికొస్తే కస్టమర్లు పటిష్టమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. తమ ఫోన్లు మొదలైన వాటిల్లో వీలైతే బయోమెట్రిక్‌ ధ్రువీకరణను ఉపయోగించాలి.
► సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎవరికైనా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం వెల్లడించడం లేదా వ్యక్తిగత వివరాలను చర్చించడం వంటివి చేయొద్దు.

మరిన్ని వార్తలు