రుణ రేట్లను పెంచిన ఎస్‌బీఐ

18 Oct, 2022 03:42 IST|Sakshi

అదే బాటలో కోటక్, ఫెడరల్‌ బ్యాంక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్‌)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్‌లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్‌)  పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ, కోటక్, ఫెడరల్‌ బ్యాంక్‌ రేట్ల పెంపు వివరాలు ఇలా..

► ఎస్‌బీఐ బెంచ్‌మార్క్‌ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్‌ 25 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది.  ఈ రేటు అక్టోబర్‌ 15 నుంచీ అమల్లోకి వస్తుంది.  మెజారీటీ  కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది.  రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్‌ఆర్‌ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి.  

► కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ వివిధ కాలపరిమితులపై 7.70–8.95  శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.75 శాతం. అక్టోబర్‌ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది.  

► ఫెడరల్‌ బ్యాంక్‌ ఏడాది రుణ రేటు అక్టోబర్‌ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది.

ఎస్‌బీఐ సేవింగ్స్‌ అకౌంట్‌ డిపాజిట్‌ రేటు కోత
కాగా, ఎస్‌బీఐ సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటును 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్‌ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్‌ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్‌ అకౌంట్స్‌పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఎఫ్‌సీఎన్‌ఆర్‌ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు
కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్‌ కరెన్సీ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌) డిపాజిట్లపై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్‌ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్‌ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది.

మరిన్ని వార్తలు