SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌...!

2 Aug, 2021 20:19 IST|Sakshi

న్యూ ఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లకోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎస్‌బీఐ యోనో, యోనో లైట్‌లో 'సిమ్‌ బైండింగ్' అనే కొత్త మెరుగైన భద్రతా ఫీచర్‌ను ప్రారంభించింది. సిమ్‌ బైండింగ్‌ ఫీచర్‌తో కొత్త యోనో, యోనో లైట్‌ యాప్‌లను ఉపయోగించే ఖాతాదారులను వివిధ డిజిటల్‌ మోసాల నుంచి రక్షించనుంది.

సిమ్‌ బైండింగ్‌ ఫీచర్‌తో కేవలం బ్యాంక్‌లో నమోదైన మొబైల్‌ నంబర్ల సిమ్‌ ఉన్న ఫోన్లలో మాత్రమే యోనో, యోనో లైట్‌ యాప్‌లు పనిచేస్తాయి. అయితే, ఖాతాదారులు బ్యాంకుతో రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ సిమ్ ఉపయోగించి ఒకే మొబైల్ పరికరంలో యోనో,  యోనో లైట్ యాప్‌ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఒకవేళ కస్టమర్ బ్యాంక్‌లో నమోదు చేయని మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తుంటే,  యోనో,  యోనో లైట్‌లో నమోదు ప్రక్రియను పూర్తి చేయలేరు.

ఈ సందర్భంగా ఎస్‌బీఐ డీఎమ్‌డీ (స్ట్రాటజీ) & చీఫ్ డిజిటల్ ఆఫీసర్ రాణా అశుతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..యోనో, యోనో లైట్‌ యాప్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫాంగా నిలిచాయని పేర్కొన్నారు. ఎస్‌బీఐ తెచ్చిన కొత్త ఫీచర్‌తో ఖాతాదారులందరికీ మెరుగైన భద్రతను అందిస్తోంది. అంతేకాకుండా కస్లమర్లను ఎల్లప్పుడూ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తుందని వెల్లడించారు.

సిమ్‌ బైండింగ్‌ ఫీచర్‌ను ఇలా యాక్సెస్‌ చేయండి...!

  • మెరుగైన భద్రతా ఫీచర్లతో వచ్చిన యోనో, యోనో లైట్‌ యాప్‌ల కొత్త వెర్షన్‌ను యాక్సెస్‌ చేయడానికి ఖాతాదారులు తమ మొబైల్ యాప్‌ని అప్‌డేట్ చేసుకోవాలి. అంతేకాకుండా యోనో, యోనో లైట్‌ యాప్‌లలో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బ్యాంకులో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సిమ్‌ను బ్యాంకు ధృవీకరిస్తుంది.
  • కస్టమర్‌లు రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్ సిమ్ ఉన్న మొబైల్‌లో తమను తము నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి.
మరిన్ని వార్తలు