మాల్యా షేర్ల విక్రయంతో స్టేట్‌ బ్యాంక్‌ కన్సార్టియంకు రూ. 5824 కోట్లు

25 Jun, 2021 19:28 IST|Sakshi

ముంబై: లిక్కర్ కింగ్, రుణ ఎగవేత దారుడు విజయ్‌ మాల్యాకు చెందిన యునైటెడ్‌ బ్రేవరీస్‌ షేర్లను ఎస్‌బీఐ నేతృత్వంలో గల బ్యాంకుల కన్సార్షియం జూన్ 23న విక్రయించింది. ఈ విక్రయం ద్వారా రూ. 5,824.5 కోట్లు వచ్చినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలియజేసింది. భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యా కేసుల్లో బ్యాంకులకు మొత్తం రూ. 22,583.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ తెలిపింది. ఈడి ప్రకారం.. పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు చేసిన మోసాలలో బ్యాంకులు నష్టపోయిన మొత్తంలో 40 శాతం (రూ.9,041.5 కోట్లు) ఇప్పటివరకు రికవరీ చేశారు.

ముంబైలోని ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీ కలిసి రూ.13,000 కోట్లు మోసం చేశారని, అలాగే విజయ్ మాల్య సుమారు రూ.9,000 కోట్లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో మోసం చేసినట్లు ఈడీ తెలిపింది. మాల్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసులో ఇదే విధమైన వాటాల అమ్మకాల ద్వారా బ్యాంకులు ఇంతకు ముందు రూ.1,357 కోట్లు పొందినట్లు ఈడీ తెలిపింది. నీరవ్ మోడీ కేసులో మరో రూ.1,060 కోట్ల విలువైన ఆస్తులు బ్యాంకులకు జప్తు చేసినట్లు పేర్కొంది. 

చదవండి: ట్విటర్‌ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం

మరిన్ని వార్తలు