నిఫ్టీ-50లో ఎస్‌బీఐ లైఫ్‌, దివీస్‌, డాబర్‌!

31 Jul, 2020 12:41 IST|Sakshi

నిఫ్టీ-50 ఇండెక్స్‌ నుంచి ఔట్‌..?

జీ ఎంటర్‌టైన్‌మెంట్..

గెయిల్‌ ఇండియా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌!

ఏడాదికి రెండుసార్లు ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీకి ప్రాతినిధ్యంవహించే కంపెనీల జాబితాను ఎన్‌ఎస్‌ఈ.. సమీక్షిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా ఇండెక్స్‌ షేర్లలో మార్పులు చేపడుతుంటుంది. సాధారణంగా జనవరి 31, జులై 31న సవరణలు ప్రతిపాదిస్తుంటుంది. నిఫ్టీ-50లో విభిన్న రంగాలకు చెందిన 50 బ్లూచిప్‌ కంపెనీల షేర్లు ప్రాతినిధ్యం వహించే సంగతి తెలిసిందే. ఈ సారి సమీక్షలో భాగంగా మీడియా కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్,  పీఎస్‌యూ.. గెయిల్‌ ఇండియా, టెలికం కంపెనీ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ నిఫ్టీలో చోటు కోల్పోవచ్చని తెలుస్తోంది. వీటి స్థానే ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, దివీస్‌ ల్యాబ్‌, డాబర్‌ ఇండియా నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించవచ్చని ఐడీబీఐ క్యాపిటల్‌ నివేదిక తాజాగా అంచనా వేసింది.

3 నెలలే
స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో కొత్తగా లిస్టయ్యే సెక్యూరిటీల విషయంలో ఆరు నెలలకు బదులుగా మూడు నెలల గణాంకాలనే పరిగణించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఫ్లోటింగ్ స్టాక్‌ సర్దుబాటులో భాగంగా మార్కెట్‌ విలువ(క్యాపిటలైజేషన్‌) విధానం ప్రకారం నిఫ్టీ షేర్లలో సవరణలుంటాయని ఐడీబీఐ నివేదిక తెలియజేసింది. ఇండెక్స్‌ విలువపై ప్రభావం చూపని షేర్ల విభజన, రైట్స్‌ ఇష్యూ తదితరాలకు సైతం ప్రాధాన్యత ఉంటుందని వివరించింది.

లాభాల్లో
ఏస్‌ ఈక్విటీ గణాంకాల ప్రకారం ఈ జనవరి నుంచి చూస్తే దివీస్‌ ల్యాబ్‌ షేరు 39 శాతం జంప్‌చేయగా.. డాబర్‌ 7.3 శాతం బలపడింది. అయితే ఎస్‌బీఐ లైఫ్‌, గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్, జీ 5-52 శాతం మధ్య క్షీణించాయి. ఇండెక్స్‌లో ఎంపిక చేసుకునే కంపెనీలకు సంబంధించి వ్యాపార పునర్వ్యవస్థీకరణ, అనుబంధ సంస్థల విడతీత తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉంటుందని, అయితే రికార్డ్‌ డేట్‌ ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని ఐడీబీఐ క్యాపిటల్ నివేదిక వివరించింది. డీలిస్టింగ్‌ బాట పట్టిన వేదాంతా స్థానే ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ను నిఫ్టీ-50 ఇండెక్స్‌లో పొందుపరచిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు