ఎన్‌పీఏల విక్రయానికి ఎస్‌బీఐ రెడీ

21 Mar, 2022 03:48 IST|Sakshi

12 ఖాతాలను ఎంపిక చేసిన బ్యాంకు

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ మొండిబకాయిలు(ఎన్‌పీఏలు)గా మారిన 12 ఖాతాలను విక్రయించే సన్నాహాల్లో ఉంది. తద్వారా రూ. 820 కోట్ల రుణాలను రికవర్‌ చేసుకోవాలని భావిస్తోంది. ఫైనాన్షియల్‌ ఆస్తుల విక్రయంపై బ్యాంకు విధానాల ప్రకారం నియంత్రణ సంస్థల నిబంధనలకులోబడి వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది. మార్చి– ఏప్రిల్‌ 13 మధ్య విక్రయించేందుకు 12 ఎన్‌పీఏ ఖాతాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు(ఏఆర్‌సీలు), ఎన్‌బీఎఫ్‌సీలు, ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు వీటిని విక్రయించనున్నట్లు తెలియజేసింది.  

ఇవీ ఖాతాలు: ఎస్‌బీఐ విక్రయించనున్న ఎన్‌పీఏ ఖాతాల వివరాలు ఇలా ఉన్నాయి. టాప్‌వర్త్‌ ఉర్జా అండ్‌ మెటల్స్‌(దాదాపు రూ. 397 కోట్ల రుణాలు) ఖాతాను ఈ నెల 29న ఈఆక్షన్‌కు పెట్టనుంది. ఇందుకు రిజర్వ్‌ ధర రూ. 85 కోట్లుగా ప్రకటించింది. రూ. 186 కోట్ల బకాయిలుగల బాలసోర్‌ అలాయ్స్‌కు రూ. 178.2 కోట్ల రిజర్వ్‌ ధరను నిర్ణయించింది. ఈ బాటలో రూ. 122 కోట్ల బకాయిలుగల మరో ఆరు ఎన్‌పీఏ ఖాతాలను 30న ఈవేలం వేయనుంది. మిగిలిన నాలుగు ఎన్‌పీఏ ఖాతాలకు ఏప్రిల్‌ 13న వేలం నిర్వహించనుంది. వీటి మొత్తం బకాయిలు రూ. 125.3 కోట్లు.

మరిన్ని వార్తలు