ఎస్‌బీఐ లాభం 55% జూమ్‌

5 Nov, 2020 05:16 IST|Sakshi

క్యూ2లో రూ.5,246 కోట్లు

మొత్తం ఆదాయం రూ.95,374 కోట్లు; 7 శాతం వృద్ధి

భారీగా దిగొచ్చిన మొండిబకాయిలు

సగానికిపైగా తగ్గిన కేటాయింపులు; రూ.5,619 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ అగ్రగామి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.5,246 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,375 కోట్లతో పోలిస్తే 55 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం సైతం రూ.89,348 కోట్ల నుంచి రూ. 95,374 కోట్లకు పెరిగింది. దాదాపు 7 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా మొండిబాకీలు భారీగా తగ్గుముఖం పట్టడం లాభాల జోరుకు దోహదం చేసింది.

స్టాండెలోన్‌గా చూస్తే...
బ్యాంకింగ్‌ కార్యకలాపాలు మాత్రమే (స్టాండెలోన్‌గా) లెక్కలోకి తీసుకుంటే ఎస్‌బీఐ క్యూ2లో రూ.4,574 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ2లో లాభం రూ. 3,012 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం స్టాండెలోన్‌ ఆదాయం 3.5 శాతం పెరుగుదలతో రూ.72,851 కోట్ల నుంచి రూ. 75,342 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 24,600 కోట్ల నుంచి రూ.28,181 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (అసాధారణ అంశాలను తీసివేసిన తర్వాత) 12 శాతం ఎగబాకి రూ.14,714 కోట్ల నుంచి రూ.16,460 కోట్లకు పెరిగింది. ఇక నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) కూడా సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 3.34 శాతానికి మెరుగుపడింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఎన్‌ఐఎం 3.22 శాతంగా నమోదైంది.

మొండిబాకీలు దిగొచ్చాయ్‌...
ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఎస్‌బీఐ మొండిబాకీలు (ఎన్‌పీఏ) భారీగా తగ్గుముఖం పట్టాయి. మొత్తం రుణాల్లో స్థూల ఎన్‌పీఏలు 5.58 శాతానికి (పరిమాణం పరంగా రూ.1.25 లక్షల కోట్లు) తగ్గాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఇవి 7.19 శాతంగా (రూ.1.61 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇక నికర ఎన్‌పీఏలు కూడా 2.79 శాతం నుంచి 1.59 శాతానికి దిగొచ్చాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ 3న ఎన్‌పీఏల విభజనపై సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల ప్రకారం లెక్కగడితే స్థూల ఎన్‌పీఏలు 5.88 శాతంగా, నికర ఎన్‌పీఏలు 2.08 శాతంగా ఉంటాయని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.  మొత్తం కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) 21.74 శాతం తగ్గుదలతో రూ.15,187 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు దిగొచ్చాయి.

క్యూ2లో రుణవృద్ధి 6 శాతంగా నమోదుకాగా, డిపాజిట్లు 14.41 శాతం వృద్ధి చెందాయి.   ఈ క్యూ2లో కొత్తగా రూ.2,756 కోట్ల విలువైన రుణాలు మొండిబాకీలుగా మారాయి. గతేడాది ఇదే క్వార్టర్‌లో కొత్తగా మొండిబాకీలుగా మారిన రుణాల పరిమాణం రూ.8,805 కోట్లుగా ఉంది. ఎన్‌పీఏలకు ప్రొవిజన్‌ కవరేజీ రేషియో క్యూ2లో 81.23 శాతం నుంచి 88.19 శాతానికి భారీగా మెరుగుపడింది. ఇప్పటివరకూ రూ.6,495 కోట్ల రుణాలకు సంబంధించి వన్‌టైమ్‌ పునర్‌వ్యవస్థీకరణ దరఖాస్తులను బ్యాంక్‌ అందుకుంది. వీటిలో రిటైల్‌ రుణాలు రూ.2,400 కోట్లు కాగా, మిగినవి కార్పొరేట్‌ రుణాలు. అందులోనూ రూ.2,400 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలవేనని బ్యాంక్‌ ఎండీ (రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్‌) సీఎస్‌ షెట్టి చెప్పారు.
ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 1.12 శాతం లాభపడి రూ. 207 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో (ఇంట్రాడేలో) రూ.198 కనిష్ట స్థాయిని, రూ.209 గరిష్టాన్ని తాకింది.

పేటీఎం ఎస్‌బీఐ కార్డ్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ఎస్‌బీఐ కార్డ్, డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎం చేతులు కలిపాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి పేటీఎం ఎస్‌బీఐ కార్డ్, పేటీఎం ఎస్‌బీఐ కార్డ్‌ సెలెక్ట్‌ పేరుతో తదుపరితరం క్రెడిట్‌ కార్డ్స్‌ను వీసా ప్లాట్‌ఫాంపై అందుబాటులోకి తెచ్చాయి. ఎస్‌బీఐ కార్డ్‌ యాప్‌తోపాటు పేటీఎం యాప్‌లోనూ ఈ కార్డులను నియంత్రించే సౌకర్యం ఉంది. కస్టమర్లు ఈ కార్డు ద్వారా పేటీఎం మాల్, మూవీ, ట్రావెల్‌ టికెట్లపై 5% క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

మా అంచనాల ప్రకారం ఆర్థిక కార్యకలాపాల్లో మళ్లీ పురోగతి నెలకొంది. చాలా కంపెనీలు కోవిడ్‌కు ముందున్నప్పటి కార్యకలాపాల స్థాయిల్లో 70–80 శాతాన్ని చేరుకున్నట్లు కనబడుతోంది. ట్రాక్టర్లతో సహా వాహన రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలకు ఇది నిదర్శనం. కొత్త మొండిబకాయిలు ఎక్కువగా వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలోనే నమోదయ్యాయి. కాగా, ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి మరో రూ.13,000 కోట్ల విలువైన రుణ పునర్‌వ్యవస్థీకరణ వినతులు రావచ్చని అంచనా వేస్తున్నాం.
– దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌

మరిన్ని వార్తలు