ఎస్‌బీఐ నికర లాభం జూమ్‌

4 Nov, 2020 14:20 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాల విడుదల

స్టాండెలోన్‌ నికర లాభం రూ. 4,574 కోట్లు

నికర వడ్డీ ఆదాయం 15 శాతం ప్లస్‌- రూ. 28,182 కోట్లకు

స్వల్ప నష్టంతో కదులుతున్న ఎస్‌బీఐ షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో నికర లాభం 52 శాతం ఎగసింది. రూ. 4,574 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 14.6 శాతం వృద్ధితో రూ. 28,182 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ. 75,342 కోట్లకు చేరింది. జీవిత బీమా అనుబంధ సంస్థలో వాటా విక్రయం కారణంగా ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం మెరుగుపడినట్లు బ్యాంక్‌ పేర్కొంది. పన్నుకుముందు లాభం 25 శాతం పుంజుకుని రూ. 6,341 కోట్లను దాటింది. ప్రొవిజన్లు 23 శాతం తక్కువగా రూ. 10,118 కోట్లకు చేరాయి.

ఎన్‌పీఏలు ఓకే
క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 5.44 శాతం నుంచి 5.28 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.86 శాతం నుంచి 1.59 శాతానికి క్షీణించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎస్‌బీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 203 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 206 వద్ద గరిష్టాన్ని తాకగా.. 201 వద్ద కనిష్టాన్ని చవిచూసింది.

మరిన్ని వార్తలు