ఎస్‌బీఐ లాభం జూమ్‌    

4 Feb, 2023 16:04 IST|Sakshi

క్యూ3లో రూ. 15,477 కోట్లు 

అదానీ రుణాలతో సమస్యల్లేవు   

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌– డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 15,477 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం రూ. 8,432 కోట్ల నుంచి రూ. 14,205 కోట్లకు ఎగసింది. రుణ నాణ్యతతోపాటు, వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 78,351 కోట్ల నుంచి రూ. 98,084 కోట్లకు పురోగమించింది. అయితే నిర్వహణ వ్యయాలు రూ. 20,839 కోట్ల నుంచి రూ. 24,317 కోట్లకు పెరిగాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 1,586 కోట్లకు పరిమితమయ్యాయి.  

ఎన్‌పీఏలు తగ్గాయ్‌ 
క్యూ3లో ఎస్‌బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.50 శాతం నుంచి 3.14 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పుంజుకుని రూ. 38,069 కోట్లయ్యింది. ఇతర ఆదాయం రూ. 8,673 కోట్ల నుంచి రూ. 11,468 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు 0.35 శాతం బలపడి 3.5 శాతానికి చేరాయి. దాదాపు 19 శాతం రుణ వృద్ధి నమోదైంది. అదానీ గ్రూప్‌నకు రూ. 27,000 కోట్ల రుణాలిచ్చినట్లు వెల్లడించింది. అయితే రుణ చెల్లింపుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని స్పష్టం చేసింది. తాజా స్లిప్పేజీలు రూ. 2,334 కోట్ల నుంచి రూ. 3,098 కోట్లకు పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి 13.27 శాతంగా నమోదైంది. 
 

మరిన్ని వార్తలు