ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త!

16 Aug, 2021 18:46 IST|Sakshi

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పండుగ రాక ముందే తన రిటైల్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. బ్యాంకు వివిధ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను రద్దు చేసినట్లు ప్రకటించింది. గతంలో గృహ రుణాలపై ఆఫర్‌ కింద 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కారు రుణాలపై, బంగారం రుణాలపై, వ్యకిగత రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను 100 శాతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ జనవరి 1, 2022 వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, వినియోగదారులు కారు ఆన్ రోడ్ ధరలపై 90 శాతం వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. 

75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపు
యోనో యాప్ ద్వారా కారు రుణం కోసం దరఖాస్తు చేస్తున్న కస్టమర్లకు బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) ప్రత్యేక వడ్డీ రాయితీని అందిస్తుంది. యోనో(యు ఓన్లీ నీడ్ వన్ యాప్) అనేది ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్. యోనో వినియోగదారులు సంవత్సరానికి 7.5 శాతం నుంచి వడ్డీ రేటుతో కారు రుణాలను పొందవచ్చని తెలిపింది. యోనో ద్వారా బంగారు రుణాలను పొందే ఖాతాదారులకు వడ్డీ రేట్లలో 75 బీపీఎస్ పాయింట్ల తగ్గింపును బ్యాంకు అందిస్తోంది. వారు సంవత్సరానికి 7.5  శాతం వడ్డీ రేటుతో బ్యాంకు నుంచి బంగారు రుణాలను పొందవచ్చు అని పేర్కొంది. అంతేగాక, యోనో ద్వారా బంగారు రుణాల కోసం దరఖాస్తు చేసే వినియోగదారులందరికీ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

కోవిడ్ యోధులకు వడ్డీ రాయితీ
వ్యక్తిగత, పెన్షన్ రుణ ఖాతాదారుల కొరకు ప్రాసెసింగ్ ఫీజుల్లో బ్యాంకు 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్ల కొరకు 50 బీపీఎస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ప్రకటించింది. కారు, బంగారు రుణాలకు కూడా ఈ ఆఫర్ త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల కోసం ‘ప్లాటినం టర్మ్ డిపాజిట్‌లను’ ప్రవేశపెడుతున్న‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది. 75 రోజులు, 75 వారాలు, 75 నెల‌ల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 15 బేసిస్ పాయింట్లు అద‌నంగా వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. ఇది 2021 ఆగ‌స్టు నుంచి 2021 సెప్టెంబ‌రు 14 వ‌ర‌కు అమ‌ల్లో ఉండనుంది. గృహ రుణాలపై వడ్డీ రేటు 6.70 శాతం వద్ద నుంచి ప్రారంభమవుతుంది.

మరిన్ని వార్తలు