SBI-5 House Finance: ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్! అంతకు మించి!

25 Mar, 2022 07:27 IST|Sakshi

న్యూఢిల్లీ: చౌక గృహ రుణ మార్కెట్‌లో మరింత పురోగమించడానికి బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ముందడుగు వేసింది. ఐదు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ)లతో సహ–రుణ ఒప్పందాలను (కో–లెండింగ్‌) కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది.

గృహ రుణాల విషయంలో ఎటువంటి సేవలకూ నోచుకోని, పొందలేని అసంఘటిత, అల్పాదాయ వర్గాలే ఈ ఒప్పందాల లక్ష్యమని వివరించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విభాగాల్లో రుణ మంజూరీలకు కృషి చేస్తామని తెలిపింది.  

ప్రాధాన్యతా రంగానికి రుణాల కోసం బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీలు సహ రుణ పథకాలు రూపొందించడానికి ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యలో ఎస్‌బీఐ తాజా అవగాహనలు కుదుర్చుకుంది.  ఆర్థిక వ్యవస్థలోని అట్టడుగు, అసంఘటిత రంగాల్లో తక్కువ వడ్డీకి రుణ లభ్యత ఉండాలన్నది ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం.  

ఐదు సంస్థలూ ఇవీ... 
ఎస్‌బీఐ ఒప్పందం చేసుకున్న ఐదు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్, శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఎడెల్వీస్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, కాప్రి గ్లోబల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లు ఉన్నాయి.  

ఎస్‌బీఐ ప్రకటన అంశాలను విశ్లేషిస్తే... 

చౌక గృహాల కొరత భారతదేశానికి, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌), సమాజంలోని అట్టడుగు, అసంఘటిత వర్గాలకు ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఈ సవాళ్లు తగ్గించడానికి ఎస్‌బీఐ తన వంతు కృషి చేస్తుంది.  

► ఐదు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో సహకారం బ్యాంకింగ్‌ దిగ్గజం– ఎస్‌బీఐ రుణ పంపిణీ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుంది,  

► 2024 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ దార్శినికత దిశలో పురోగతికి ఈ ఒప్పందాలు  దోహదపడతాయి. 

రుణ విస్తరణ లక్ష్యం... 
అసంఘటిత, బలహీన వర్గాలకు గృహ రుణ విస్తరణ జరగాలన్నది మా అవగాహనల లక్ష్యం.  భారతదేశంలోని చిన్న గృహ కొనుగోలుదారులకు సమర్థ వంతమైన, సరసమైన వడ్డీలకు రుణాలను వేగవంతం చేరాలన్న బ్యాంక్‌ లక్ష్యాన్ని చేరుకోడానికి ఇటువంటి భాగస్వామ్యాలు దోహదపడతాయి. – దినేష్‌ ఖారా,ఎస్‌బీఐ చైర్మన్‌ 

20:80 విధానంలో... 
ఆర్‌బీఐ 20:80 సహ–లెండింగ్‌ నమూనా ప్రకారం  సంయుక్తంగా  కస్టమర్‌లకు సేవలు అందిస్తాము. చౌక విభాగంలో హౌసింగ్‌  డిమాండ్‌ విపరీతంగా ఉంది. కో–లెండింగ్‌ మోడల్‌ ద్వారా  మేము మా పూచీకత్తు సామర్థ్యాల మెరుగుదలనూ కోరుకుంటున్నాము. – రవి సుబ్రమణియన్, శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ చీఫ్‌ 

విస్తరణకు మార్గం 
ఎస్‌బీఐతో  వ్యూహాత్మక భాగస్వామ్యం మా రిటైల్‌ హోమ్‌ లోన్‌ సెగ్మెంట్‌ సేవల విస్తరణలో ఒక కీలకమైన ఘట్టం. భారత్‌లోని శ్రామిక, అసంఘటిత, అట్టడుగు వర్గాలకు హౌసింగ్‌ రుణాల విషయంలో మెరుగైన సేవలందించేందుకు  దీనివల్ల మాకు వీలు కలుగుతుంది.  – హరదయాళ్‌ ప్రసాద్, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ అండ్‌ సీఈఓ 

లాభాలను పెంచుతుంది.. 
ఒప్పందం రెండు సంస్థల లాభదాయకతను పెంచడానికి, హోమ్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియోలను విస్తరించడానికి సహాయపడుతుంది. విలువైన ప్రతి రుణగ్రహీతకు మరింత ఫైనాన్స్‌ అవకాశాలను సృష్టిస్తుంది. సామాన్యుని సొంత ఇంటి కల నెరవేర్చడంలో ఈ భాగస్వామ్యం కీలకమవుతుంది. –  రాజేష్‌ శర్మ ,కాప్రి గ్లోబల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ

ఆకర్షణీయమైన రేట్లకే... 
ఈ ఒప్పందం కింద.. రుణ గ్రహీతను గుర్తించడం, రుణాన్ని మంజూరు చేయడం, వసూలు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తాం.  అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో మరింత విస్తరించేందుకు అలాగే  రుణ గ్రహీతలకు ఆకర్షణీయమైన రేట్లకే రుణాలు అందించడానికి ఒప్పందం దోహదపడుతుంది. – మోను రాత్రా,ఐఐఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎఫ్‌ఎల్‌ చీఫ్‌  

>
మరిన్ని వార్తలు