గృహ రుణాలపై ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌..!

31 Jul, 2021 18:52 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ  కొత్తగా గృహ రుణాలను తీసుకునే కస్టమర్లకు తీపికబురును అందించింది. గృహ రుణాలపై ఎస్‌బీఐ మాన్‌సూన్‌ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది.  గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును మినహాయిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఎస్‌బీఐ గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును 0.4శాతం మేర వసూలు చేసేది. ఈ ఆఫర్‌  2021 ఆగస్టు 31 వరకు  అందుబాటులో ఉండనుంది. మాన్‌సూన్‌ ధమాకా ఆఫర్‌తో గృహ రుణాలను తీసుకొనే కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని  ఎస్‌బీఐ  పేర్కొంది. గృహ రుణ వడ్డీ రేట్లు కేవలం 6.70 శాతంతో ప్రారంభమవుతాయని ఎస్‌బీఐ తెలిపింది.

కొత్తగా గృహరుణాలను తీసుకునే ప్రణాళికలు ఉన్న వారికి ఇదే సరైన సమయమని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌బీఐ ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు ఇవ్వడంతో కొత్తగా గృహరుణాలను తీసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడనుందని ఎమ్‌డీ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. కనిష్ట స్థాయి గృహ రుణాల వడ్డీ రేట్లు  గృహ కొనుగోలుదారులకు రుణాలను  సులభంగా తీసుకోవడానికి ఎస్‌బీఐ ప్రోత్సహిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.ఎస్‌బీఐ ప్రతి భారతీయుడికి బ్యాంకర్‌గా ఉండటానికి ప్రయత్నిస్తుందని, తద్వారా, దేశ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని ఎస్‌బీఐ ఎమ్‌డీ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు. 

యోనో యాప్‌ ద్వారా గృహ రుణాలను ఆప్లై చేసుకున్నట్లయితే సుమారు 5బీపీఎస్‌ పాయింట్ల రాయితీ లభించనుంది. అంతేకాకుండా మహిళలకు రుణాలపై 5బీపీఎస్‌ పాయింట్ల రాయితీని ఎస్‌బీఐ అందించనుంది.   


 

మరిన్ని వార్తలు