ఏజెంట్లు, ప్రయాణీకులకు రిఫండ్స్‌ ఎలానో చెప్పండి

24 Sep, 2020 06:09 IST|Sakshi

లాక్‌డౌన్‌ లో ఎయిర్‌ టిక్కెట్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ముందుగా బుక్‌ చేసుకున్న టిక్కెట్ల రద్దు విషయంలో ఏజెంట్లు, ప్రయాణీకులకు రిఫండ్స్‌ ఎలా జరుపుతారన్న అంశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం బుధవారం కేంద్రానికి స్పష్టం చేసింది.  రిఫండ్స్‌ విధివిధానాలు, ప్రక్రియపై  వివరణ ఇస్తూ,  ఈ నెల 25వ తేదీలోపు తాజా అఫిడవిట్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తులు అశోక్‌ భూషన్, ఆర్‌ సుభాషన్‌ రెడ్డి, ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్‌లో పూర్తి స్పష్టత లేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్వయంగా పేర్కొనడం దీనికి నేపథ్యం. అటు పాసింజర్లు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రిఫండ్స్‌ విషయంలో కేంద్రం తగిన పరిష్కార విధానాన్ని రూపొందించిందని అంతకుముందు విమానయాన, డీజీసీఏల తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు