టెలికం కంపెనీలకు ‘సుప్రీం’ నిరాశ

24 Jul, 2021 04:01 IST|Sakshi

ఏజీఆర్‌ లెక్కల సవరణపై పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు  

న్యూఢిల్లీ:  ప్రభుత్వానికి తాము చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల లెక్కల్లో తప్పులు దొర్లాయని, సవరించడానికి అనుమతించాలని వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, టాటా టెలీ సర్వీసెస్‌లు దాఖలు చేసుకున్న పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వరరావు, ఎస్‌ఏ నజీర్, ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో వేసిన లెక్కలే చివరివనీ, వీటిలో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే...

► దాదాపు రూ.1.4 లక్షల కోట్ల ఏజీఆర్‌ను టెలికం శాఖ డిమాండ్‌ చేసింది. టెలికంకు అనుకూలం గా 2019 అక్టోబర్‌లో సుప్రీం తీర్పు నిచ్చింది.  
► అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీం కొంత ఊరటనిచ్చింది. టెలికం డిమాండ్‌ చేసిన ఏజీఆర్‌ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీలోపు చెల్లించాలని టెలికం కంపెనీలకు గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన మొత్తాలను  2021 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2031 మర్చి 31వ తేదీ లోపు వార్షిక వాయిదాల్లో చెల్లించాలని సూచించింది.  ఆయా అంశాలపై ఇదే తుది నిర్ణయమని కూడా స్పష్టం చేసింది.
► భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాసహా ఆపరేటర్లు  ఏజీఆర్‌ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించాయి.  
► వేర్వేరుగా చూస్తే, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.43,980 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) రూ.58,254 కోట్లు, టాటా గ్రూప్‌ రూ.16,798 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.5,835.85 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.4,352.09 కోట్లు చెల్లించాల్సి ఉంది.  
► ఇందులో భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పటికే రూ.18,004 కోట్లు చెల్లించింది. వొడాఫోన్‌ ఐడియా రూ.7,854 కోట్లు, టాటాలు రూ.4,197 కోట్లు, రిలయన్స్‌ జియో రూ.194.79 కోట్లు చెల్లించాయి.
► అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ.25,194.58 కోట్లు, ఎయిర్‌సెల్‌ రూ.12,389 కోట్లు, వీడియోకాన్‌ కమ్యూనికేషన్స్‌ రూ.1,376 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇవి దివాలా ప్రక్రియలో ఉన్నాయి.  
► ప్రభుత్వానికి రూ.604 కోట్లు బకాయిపడ్డ లూప్‌ టెలికం, ఎటిసలాట్‌ డీబీ, ఎస్‌ టెల్‌ భారత్‌లో తమ కార్యకలాపాలను మూసివేశాయి.
► ఇదిలావుండగా,  తమ ఆస్తులలో భాగంగా ఎయిర్‌ వేవ్స్‌ లేదా స్పెక్ట్రంను  టెలికం కంపెనీలు బదిలీ చేయవచ్చా లేదా విక్రయించవచ్చా అనే ప్రశ్నపై దాఖలైన ఇతర పిటిషన్ల విచారణ ప్రస్తుతం సుప్రీం ధర్మాసనం ముందు ఉంది.  

 

షేర్ల ధరలు ఇలా...
సుప్రీం తీర్పు నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేర్‌ ధర శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 10 శాతం పడి, రూ.8.35 వద్ద ముగిసింది. ఇక ఇండస్‌ టవర్స్‌ షేర్‌ ధర 5 శాతం తగ్గి రూ.220.50 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ ధర మాత్రం స్వల్పంగా (0.29 శాతం) పెరిగి రూ.548.30 వద్ద ముగిసింది. టాటా టెలిసర్వీసెస్‌ కూడా 5 శాతం నష్టపోయి రూ. 37.75 వద్ద ముగిసింది.

వీఐఎల్‌కు ఇబ్బందే: విశ్లేషణలు
సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు టెలికం కంపెనీలకు ప్రత్యేకంగా రుణ భారాలను మోస్తున్న వొడాఫోన్‌ ఐడియాకు తీవ్ర ఇబ్బందికర పరిణామమని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ తీర్పు ప్రతికూలతను పరోక్షంగా ఎదుర్కొనే సంస్థల్లో తరువాత ఇండస్‌ టవర్స్‌ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. ఫైనాన్షియల్‌ సేవల సంస్థ... సిటీ దీనిపై విశ్లేషిస్తూ, వొడాఫోన్‌ ఐడియా దాదాపు రూ.25,000 కోట్ల సమీకరణ ప్రణాళికలపై తాజా పరిణామం ప్రభా వం పడుతుందని పేర్కొంది. అయితే భారతీ ఎయిర్‌టెల్‌ పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉండబోదని విశ్లేషించింది. ఎడిల్వీస్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు