అమెజాన్‌కు ఊరట: సుప్రీం కీలక ఉత్తర్వులు

22 Feb, 2021 14:56 IST|Sakshi

రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు బ్రేక్‌ వేసిన సుప్రీం

మూడువారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ:  అమెజాన్, ఫ్యూచర్ గ్రూపు వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్‌ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) డీల్‌కు మరోసారి బ్రేక్‌ పడింది. ఈ ఒప్పందానికి సంబంధించి "యథాతథ స్థితిని" కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ తీర్పుపై స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్,  బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం ఫ్యూచర్ రిటైల్, గ్రూపు అధినేత కిషోర్ బియానీ, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రానున్న మూడు వారాల్లో దీనిపై  సమాధానం చెప్పాలని కోరింది. అలాగే  ఈ వివాదంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)  విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఆర్‌ఐఎల్‌తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ 2021 పిబ్రవరి 2న ఉత్తర్వులిచ్చింది. దీనిపై అమెజాన్‌ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం తాజా ఆదేశాలతో రిలయన్స్‌ రీటైల్‌తో ఒప్పందానికి సంబంధించి ఫ్యూచర్  గ్రూపునకు తాజాగా మరో ఎదురు దెబ్బ గిలింది.

మరిన్ని వార్తలు