Amazon-Flipkart: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు సుప్రీం షాక్‌ !

9 Aug, 2021 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీలపై సీసీఐ జరుపుతున్న విచారణను నిలిపేందుకు నిరాకరించింది. యాంటీ కాంపిటీటీవ్ ప్రాక్టీస్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై విచారణ మీద స్టే విధించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు తమ సైట్లలో అమ్మే వస్తువుల్లో అన్ని రకాల వస్తువులకు సమ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కొన్ని వస్తువుల అమ్మకానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఢిల్లీ వ్యాపార మహాసంఘం కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి ఫిర్యాదు చేసింది. ఆ రెండు కంపెనీలు కావాలనే కొందరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది.  దీనిపై తొలుత కర్నాటక హై కోర్టు విచారణ చేపట్టింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీల మీద ప్రాధమిక విచారణ జరపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు తమతంట తామే విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు ఆ రెండు కంపెనీలకు నాలుగు వారాల గడువు ఇచ్చారు.  దీంతో పాటు గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా సుప్రీం కోర్టు ‍ స్పందించింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి మాకేం కనిపించడం లేదని పేర్కొంది.

మరిన్ని వార్తలు