విధాన నిర్ణయాల్లో... మా జోక్యం ఉండదు

10 Jul, 2021 05:29 IST|Sakshi

ఎన్‌పీఏలపై సుప్రీం స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: విధానపరమైన నిర్ణయాల్లో తమ జోక్యం ఉండబోదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకులు రుణ అకౌంట్లను మొండిబకాయిలుగా (ఎన్‌పీఏ) ప్రకటించడాన్ని నిలుపుచేస్తూ తాను ఇచ్చిన స్టేను మార్చి 23వ తేదీన సుప్రీంకోర్టు తొలగించింది. అయితే ఎన్‌పీఏగా ప్రకటించడానికి సంబంధించి మరిన్ని అంశాలను సమీక్షించాలని దాఖలైన తాజా పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం ఉండబోదని పేర్కొంది. విశాల్‌ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘ఇప్పటికే వచ్చిన తీర్పులో పేర్లు, సంబంధిత పొరపాట్లు ఏదైనా జరిగితే సవరణలకు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయవచ్చు. మీరు దాఖలు చేసిన పిటిషన్‌లో అలాంటి అంశాలు ఏవీ లేవు.

దీనిని మేము విచారించలేము’’ అని డీవై చంద్రచూడ్, ఎంఆర్‌ షాలతో కూడిన డివిజనల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. దీనితో ఈ అప్లికేషన్‌ ఉపసంహరణకు న్యాయవాది ధర్మాసనం అనుమతి కోరారు. దీనికి బెంచ్‌ అంగీకరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణ చెల్లింపులపై గత ఏడాది ఆగస్టు 31 వరకూ 6 నెలల పాటు ఆర్‌బీఐ మారటోరియం విధించింది. ఈ కాలంలో బ్యాంకింగ్‌ చక్రవడ్డీ వసూళ్లపై జరిగిన విచారణ సందర్భంగా సెప్టెంబర్‌ 3వ తేదీన సుప్రీంకోర్టు ఒక రూలింగ్‌ ఇస్తూ, ఆగస్టు 31 వరకూ మొండిబకాయిలుగా ప్రకటించిన ఖాతాలను తన తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. ఇరు పక్షాల వాదనల అనంతరం ఈ స్టేను వెకేట్‌ చేస్తూ,  ఈ ఏడాది మార్చి 23న తీర్పును ఇచ్చింది.  అలాగే మారటోరియం కాలంలో చక్రవడ్డీ తగదనీ ఆదేశా లు ఇచ్చింది. దీనితో తీర్పునకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అప్పటికే వసూలు చేసిన వడ్డీ మొత్తాలను రిఫండ్‌ చేసేలా లేదా రుణ అకౌంట్ల తదుపరి వాయిదాల్లో సర్దుబాటు జరిగేలా బ్యాంకింగ్‌కు ఆదేశాలిచ్చింది.  

మరిన్ని వార్తలు