టెలికం బాకీలు... రిజర్వ్‌లో సుప్రీం తీర్పు

25 Aug, 2020 05:57 IST|Sakshi

రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌  ‘బకాయిల’పైనా రానున్న స్పష్టత

న్యూఢిల్లీ: టెలికం సంస్థలు కట్టాల్సిన ఏజీఆర్‌ బాకీలపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఆర్‌కామ్‌ తదితర సంస్థల నుంచి స్పెక్ట్రం తీసుకున్నందుకు గాను రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కూడా అదనంగా బాకీలు కట్టాల్సి ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టతనివ్వనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) ఫార్ములా ప్రకారం టెలికం సంస్థలు కట్టాల్సిన స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలకు సంబంధించిన కేసుపై సోమవారం కూడా విచారణ కొనసాగింది. ఒకవేళ స్పెక్ట్రం విక్రేత గానీ బాకీలు కట్టకుండా అమ్మేసిన పక్షంలో ఆ బకాయీలన్నీ కొనుగోలు సంస్థకు బదిలీ అవుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఒకవేళ టెల్కోలు గానీ బాకీలు కట్టేందుకు సిద్ధంగా లేకపోతే స్పెక్ట్రం కేటాయింపును పూర్తిగా రద్దు చేయాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. అయితే, స్పెక్ట్రం రద్దు చేసిన పక్షంలో ప్రభుత్వానికి గానీ బ్యాంకులకు గానీ దక్కేది ఏమీ ఉండదని జియో తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వకేట్‌ హరీష్‌ సాల్వే తెలిపారు. విక్రేత, కొనుగోలుదారు నుంచి విడివిడిగా లేదా సంయుక్తంగా బాకీలను తాము వసూలు చేసుకోవచ్చని టెలికం శాఖ (డాట్‌) వెల్లడించింది. ఈ వాదనల దరిమిలా దివాలా చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు.. స్పెక్ట్రంను విక్రయించవచ్చా అన్న అంశంతో పాటు వాటి నుంచి ప్రభుత్వం ఏజీఆర్‌పరమైన బాకీలను ఎలా రాబట్టాలి అన్న దానిపైన సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది.

ఏజీఆర్‌ బకాయిల విషయంలో సర్వీస్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపునకు విజ్ఞప్తి
మరోవైపు, ఏజీఆర్‌ బకాయిలపై సర్వీస్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ కేంద్రాన్ని కోరింది. అదనంగా లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను కట్టాల్సి రానుండటంతో దీనికి సర్వీస్‌ ట్యాక్స్‌ కూడా తోడైతే మరింత భారం అవుతుందని జూలై 17న కేంద్ర టెలికం శాఖకు రాసిన లేఖలో సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచర్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2016 – మార్చి 2017 మధ్యకాలంలో సర్వీస్‌ ట్యాక్స్‌ బాకీల కింద టెలికం సంస్థలు రూ. 6,600 కోట్లు కట్టినట్లు తెలిపారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు