ప్రయాణికులకు రీఫండ్‌ వోచర్లు..?

26 Sep, 2020 04:21 IST|Sakshi

‘లాక్‌డౌన్‌’ విమాన టికెట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన

పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు; తీర్పు రిజర్వ్‌  

న్యూఢిల్లీ:  లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణాలకు ముందుగా  రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్‌ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్‌ చేసుకుంది. బదలాయింపులకు వీలయిన రిఫండ్‌ వోచర్లు జారీ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారం చూపవచ్చన్న కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు అశోక్‌ భూషన్, ఆర్‌ సుభాషన్‌ రెడ్డి, ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... లాక్‌డౌన్‌ సమయంలో రద్దయిన సర్వీసులకు సంబంధించి  ప్రయాణి కులకు డబ్బు వాపసు చేస్తే,  ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఆర్థికంగా మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ‘బదలాయింపునకు వీలయిన రిఫండ్‌ వోచర్లను’ ప్రయాణి కులకు జారీ చేస్తే అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలుగదు.

వోచర్స్‌ను ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసిన తమ ఏజెంట్లకు సమర్పించి, డబ్బు వాపసు తీసుకోవచ్చు. లేదా తదుపరి తమ ప్రయాణాల టికెట్‌ బుకింగ్‌లకు వినియోగించుకోవచ్చు. డబ్బు వాపసు ఇచ్చిన పక్షంలో ఆయా వోచర్లను వేరొకరి ప్రయాణాలకు వినియోగించే సౌలభ్యతను ఏజెంట్లకు కల్పించడం జరుగుతుంది. ఎన్‌జీఓలు, ప్యాసింజర్ల అసోసియేషన్స్‌సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు రెండు వర్గాల వాదనలు విన్న సంగతి తెలిసిందే.  కేంద్రం, డీజీసీఏ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) తరఫున తుషార్‌ మెహతా చేసిన ‘బదలాయింపులకు వీలయిన రిఫండ్స్‌ వోచర్ల’ ప్రతిపాదనకు ట్రావెల్‌ ఏజెంట్ల సంస్థ తరఫున వాదలను వినిపించిన సీనియర్‌ అడ్వకేట్‌ పల్లవ్‌ సిసోడియా సానుకూల స్పందన వ్యక్తం చేయడం శుక్రవారంనాటి మరో కీలకాంశం. ఇండిగో ఎయిర్‌లైన్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహత్గీ కూడా సంబంధిత ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు.  

విదేశీ విమాన సర్వీసులకు వర్తించదు!
కాగా వాదనల సమయంలో ‘ప్రవాసీ లీగల్‌ సెల్‌’ ఎన్‌జీఏ సంస్థ తరఫు సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్గే విదేశాల నుంచి టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి రిఫండ్‌ పరిస్థితిని ప్రస్తావించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, విదేశీ విమాన సర్వీసుల అంశంలోకి వెళ్లలేమని పేర్కొంది. సంబంధిత టికెట్లకు రిఫండ్‌ను భారత్‌ ప్రభుత్వం ఆదేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా