ఇది కదా ఆవిష్కరణ అంటే.. కాగితం బ్యాటరీ తయారు చేసిన ఆ దేశ సైంటిస్టులు!

16 Dec, 2021 21:26 IST|Sakshi

మామూలుగా బ్యాటరీలను లిథియం, నికెల్, కోబాల్ట్‌తో పాటు ఇంకా రకరకాల రసాయనాలు వాడి తయారు చేస్తారు. అలాంటి రసాయనాలతో మున్ముందు మనుషులకు ప్రమాదమే. అలా కాకుండా పర్యావరణానికి హాని చేయని పదార్థాలతో బ్యాటరీ చేస్తే. మనకు బాగా పరిచయమున్న కాగితంతోనే తయారు చేస్తే. వావ్‌.. సూపర్‌ అంటారా. అనాల్సిందే. ఎందుకంటే సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ఇలాంటి బ్యాటరీనే రూపొందించింది మరి. 4 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు ఉండే ఈ బ్యాటరీ చిన్న ఫ్యాన్‌ను 45 నిమిషాలపాటు తిప్పగలదు. అరె.. కాగితంతో చేశారుగా.. మడిచేస్తే, కత్తిరిస్తే ఎలా? బ్యాటరీ పనిచేయదుగా అనుకునేరు! మడతేసినా, మెలితిప్పినా, ముక్కలు చేసినా విద్యుత్‌ ప్రవాహం ఆగదు.  

ఎలా తయారు చేశారబ్బా! 
కాగితంలో సెల్యులోజ్‌ అనే పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్‌లోని సూక్ష్మ స్థాయి గ్యాప్‌ను హైడ్రోజెల్‌తో పూడ్చేసి స్క్రీన్‌ ప్రింట్‌ చేసిన ఎలక్ట్రోడ్‌లు(క్యాథోడ్, ఆనోడ్‌)లను అతికించి ఈ బ్యాటరీని తయారు చేశారు. యానోడ్‌ తయారీకి జింక్, కార్బన్‌లను ఉపయోగిస్తే మాంగనీస్, నికెల్‌లతో క్యాథోడ్‌ను ముద్రించారు. ప్రింటింగ్‌ తరువాత రెండింటినీ ఒక ఎలక్ట్రోలైట్‌ ద్రావణంలో పెట్టి పలుచటి బంగారపు పూత పూస్తారు. ఈ బ్యాటరీ 0.4 మిల్లీమీటర్ల మందమే ఉంటుంది. ఒకసారి వాడాక ఈ బ్యాటరీల్లోని రసాయనాలన్నీ సహజసిద్ధంగా నశిస్తాయి. కాలుష్యం లేకుండా మాంగనీస్, నికెల్‌లు హైడ్రాక్సైడ్‌లుగా మారిపోతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఫాన్‌ హాంగ్‌జిన్‌ తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న బ్యాటరీలకు ఇవి మంచి ప్రత్యామ్నాయం కాగలవన్నారు.

(చదవండి: దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!)


మరిన్ని వార్తలు