చికుబుకు చికుబుకు రైలే.. మేలో ఆదాయం వేయి కోట్లకు పైనే..

3 Jun, 2022 15:35 IST|Sakshi

‍కరోనా సంక్షోభ సమయం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న రైల్వేశాఖ నెమ్మదిగా ట్రాక్‌ ఎక్కుతోంది. తాజాగా హాలిడే సీజన్‌ను ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంది. లక్షల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి వందల కోట్ల రూపాయల ఆదాయం సాధించింది. దీంతో పాటు సరుకు రవాణాలోనూ దుమ్ము రేపుతూ వేల కోట్ల ఆదాయం సొంతం చేసుకుంది.

పూర్తిగా విభజించని దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, మన్మాడ్‌, గుంతకల్లు డివిజన్లు ఉన్నాయి. ఇవి తెలంగాణ, ఆంధప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రలతో పాటు అతి స్వల్పంగా తమిళనాడులో విస్తరించి ఉన్నాయి. ఈ ఆరు డివిజన్లకు సంబంధించి 2022 మేలో రైల్వే శాఖకు టికెట్ల అమ్మకం ద్వారా రికార్డు స్థాయిలో 423.98 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఒక్క మేలో 1.14 లక్షల మంది దక్షిణ మధ్య పరిధిలో రైళ్లలో ప్రయాణించారు. వీరి కోసం సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను కూడా అందుబాటులో ఉంచారు. 

సరుకు రవాణాలోనూ దక్షిణ మధ్య రైల్వే రికార్డు సాధించింది. కేవలం సరుకు రవాణా ద్వారానే మేలో రూ.1067 కోట్ల రూపాయల ఆదాయం సాధించింది. దక్షిణ మధ్య రైల్లే పరిధిలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉండటంతో సిమెంటు పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటికి అవసరమైన బొగ్గును రవాణా చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలోనూ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ప్రణాళిక అమలు చేసింది. ఫలితంగా రికార్డు స్థాయి లాభాలు వచ్చాయి.

చదవండి: గుడ్‌న్యూస్‌! రైల్వే స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు

మరిన్ని వార్తలు