-

స్క్రాపేజ్‌ పాలసీతో కొత్త వాహనాలకు డిమాండ్‌

20 Mar, 2021 01:07 IST|Sakshi

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమకు   వాహన స్క్రాపేజ్‌ పాలసీ కలిసొస్తుందని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2021–22 కేంద్ర బడ్జెట్‌లో స్వచ్ఛంధ వాహన స్క్రాపింగ్‌ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీలో వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్‌ వెహికిల్స్‌కు 15 ఏళ్ల ఫిట్‌నెస్‌ టెస్ట్‌లను నిర్వహిస్తారు. భారీ వాణిజ్య వాహనాలకు 2023 ఏప్రిల్‌ నుంచి, ఇతర వాహనాలకు 2024 జూన్‌ నుంచి పరీక్షలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో అనర్హమైన వాహనాలు తొలగిపోతాయని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్‌ పెరగడంతో పాటు వాహన పరిశ్రమ స్థిరపడుతుందని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ శంషేర్‌ దేవాన్‌ తెలిపారు. దీంతో పాటు కాలుష్యం, చమురు ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం, మెటల్‌ రీసైక్లింగ్, ముడి పదార్థాల వ్యయాలను తగ్గించడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే స్క్రాపింగ్‌ పాలసీ విజయవంతం కావాలంటే మౌలిక వసతుల ఏర్పాటు, స్క్రాప్‌ విలువల మదింపుపై మరింత స్పష్టత, స్క్రాప్‌ సర్టిఫికెట్‌ సామర్థ్యం వంటివి కీలకమని అభిప్రాయపడ్డారు. 2024 ఆర్ధిక సంవత్సరం నాటికి 15 ఏళ్ల కంటే పాత వాహనాలు 1.1 మిలియన్‌ యూనిట్లు ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. అయితే ఆయా వాహనాల వినియోగం, స్వభావాలను బట్టి వాస్తవిక స్క్రాపేజీ సంభావ్యత కొంత మేర తగ్గొచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు