Stock Market: విలీనాలు, కొనుగోళ్లు ఇప్పుడు మరింత సులభం

8 Dec, 2021 08:50 IST|Sakshi

డీలిస్టింగ్‌ నిబంధనల సవరించిన సెబీ

విలీనాలు, కొనుగోళ్ల  లావాదేవీలకు దన్ను 

ఇకపై ఓపెన్‌ ఆఫర్, సంకేత ధరల వెల్లడి  

న్యూఢిల్లీ: ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కంపెనీల డీలిస్టింగ్‌కు వర్తించే నిబంధనలను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సవరించింది. తద్వారా విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా చేపట్టేందుకు వీలు కల్పించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రమోటర్లు లేదా కొనుగోలుదారులు డీలిస్ట్‌కు కారణాన్ని ప్రాథమిక ప్రకటన ద్వారా పబ్లిక్‌కు తెలియజేయవలసి ఉంటుంది. కొనుగోలుదారులు టార్గెట్‌గా ఎంచుకున్న కంపెనీని డీలిస్ట్‌ చేసే యోచనలో ఉంటే తప్పనిసరిగా ఓపెన్‌ ఆఫర్‌కు మించిన ప్రీమియం ధరను వాటాదారులకు ప్రకటించవలసి ఉంటుంది. పరోక్ష కొనుగోలుకి వీలుగా ఓపెన్‌ ఆఫర్‌ను ఎంచుకుంటే ఈ ధరతోపాటు.. సంకేత ధరను సైతం పబ్లిక్‌కు నోటిఫై చేయవలసి వస్తుంది. ఓపెన్‌ ఆఫర్‌ అంశంపై వివరాలు ప్రకటించే సమయంలో వీటిని వెల్లడించవలసి ఉంటుంది. డీలిస్టింగ్‌కు అనుగుణంగా ఎంత ప్రీమియంను చెల్లించగలిగేదీ తెలియజేయవలసి ఉంటుంది. టెండరింగ్‌ ప్రారంభమయ్యేలోపు కొనుగోలుదారుడు డీలిస్టింగ్‌ ప్రీమియం ధరను పెంచేందుకు సైతం వీలుంటుంది. ప్రస్తుతం ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలుదారుడి వాటా టార్గెట్‌ కంపెనీలో 75–90 శాతానికి మించితే.. డీలిస్ట్‌ చేసేందుకు ముందుగా ప్రమోటర్‌ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంటుంది.

సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా ప్రమోటర్లు 90 శాతం వాటాను సొంతం చేసుకోగలిగితే సంకేత ధరనే వాటాదారులకు చెల్లిస్తారు. ఇలాకాకుండా డీలిస్టింగ్‌కు అవసరమైన వాటాను ప్రమోటర్లు సొంతం చేసుకోలేకపోతే.. వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ధరనే చెల్లిస్తారు. ఇలాంటి సందర్భంలో రివర్స్‌ బుక్‌బిల్డింగ్‌ పద్ధతిలో 12 నెలల్లోగా మరోసారి డీలిస్టింగ్‌కు ప్రమోటర్లు ప్రయత్నించేందుకు వీలుంటుంది. ఇది కూడా విఫలమైతే తదుపరి ఏడాదిలోగా ప్రమోటర్లు పబ్లిక్‌కు కనీస వాటాకు వీలు కల్పించవలసి వస్తుంది.
 

మరిన్ని వార్తలు