రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

25 Jan, 2023 15:03 IST|Sakshi

న్యూఢిల్లీ: సెబీ తాజాగా రెండు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో ఎలక్ట్రానిక్‌ తయారీ సర్వీసులు అందించే ఎవలాన్‌ టెక్నాలజీస్, నిర్మాణ రంగ కంపెనీ ఉదయ్‌శివకుమార్‌ ఇన్‌ఫ్రా ఉన్నాయి. అయితే బీటూబీ పేమెంట్స్, సర్వీసుల సంస్థ పేమేట్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూకి తాత్కాలికంగా బ్రేకులు వేసింది. ఈ నెల మొదట్లో మొబైల్‌ తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్, ఓయో బ్రాండ్‌ ట్రావెల్‌ టెక్‌ సంస్థ ఒరావెల్‌ స్టేస్‌ లిమిటెడ్‌ ఐపీవో దరఖాస్తులను సైతం తాజా సమాచారం కోసం సెబీ తిప్పి పంపిన విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం..

ఎవలాన్‌ టెక్‌ 
ఐపీవోలో భాగంగా ఎవలాన్‌ టెక్నాలజీస్‌ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 625 కోట్ల విలువైన షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 1999లో ఏర్పాటైన ఎవలాన్‌ ఎండ్‌ టు ఎండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సర్వీసులను అందిస్తోంది. క్లయింట్ల జాబితాలో క్యోసన్‌ ఇండియా, జోనర్‌ సిస్టమ్స్‌ ఇంక్, కొలిన్స్‌ ఏరోస్పేస్, ఈఇన్ఫోచిప్స్, మెగ్గిట్, సిస్టెక్‌ కార్పొరేషన్‌ తదితరాలున్నాయి.  

ఉదయ్‌శివకుమార్‌ 
ముసాయిదా ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా ఉదయ్‌శివకుమార్‌ ఇన్‌ఫ్రా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. పబ్లిక్‌ ఇష్యూ నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. రహదారుల నిర్మాణంలో కంపెనీ కార్యకలాపాలు కలిగి ఉంది. కర్ణాటకలో రోడ్డు, బ్రిడ్జిలు, కాలువలు, పారిశ్రామిక ప్రాంత ప్రాజెక్టులతోపాటు ప్రభుత్వ శాఖల ఆర్డర్లు చేపడుతోంది.   

పేమేట్‌ ఇండియా 
బీటూబీ పేమెంట్స్, సర్వీసుల కంపెనీ పేమేట్‌ ఇండియా ఐపీవో దరఖాస్తుకు సెబీ బ్రేక్‌ వేసింది. కొన్ని అంశాలలో తాజా సమాచారంతో కూడిన మరో దరఖాస్తును తిరిగి దాఖలు చేయమంటూ ఆదేశించింది. కంపెనీ తొలుత 2022 మే నెలలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణ యోచనలో ఉంది. ప్రతిపాదిత దరఖాస్తు ప్రకారం రూ. 1,125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 375 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ క్రెడిట్‌ కార్డ్‌ దిగ్గజం వీసాతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

చదవండి: మరీ ఇంత దారుణమా! అద్దె కూడా చెల్లించని ఎలాన్‌ మస్క్‌.. కోర్టులో దావా
 

మరిన్ని వార్తలు