సెబీ అనుమతి తప్పనిసరి

26 Aug, 2022 04:31 IST|Sakshi

ప్రమోటర్ల వాటా కొనుగోలుపై ఎన్‌డీటీవీ వెల్లడి

న్యూఢిల్లీ: కంపెనీకి చెందిన ప్రమోటర్ల వాటా కొనుగోలుకి క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి తప్పనిసరి అంటూ వార్తా చానళ్ల మీడియా సంస్థ ఎన్‌డీటీవీ తాజాగా స్పష్టం చేసింది. చెల్లించని రుణాలస్థానే ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్‌ లిమిటెడ్‌లో వాటాను చేజిక్కించుకునేందుకు వీసీపీఎల్‌.. సెబీ అనుమతి పొందవలసి ఉన్నట్లు పేర్కొంది. 2020 నవంబర్‌ 27న కంపెనీ వ్యవస్థాపక ప్రమోటర్లు ప్రణయ్, రాధికా రాయ్‌లను సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది.

తద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీల కొనుగోలు, విక్రయం లేదా సెక్యూరిటీల మార్కెట్లలో ఏ ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా ఆంక్షలు విధించింది. ఈ నిషేధం 2022 నవంబర్‌ 26న ముగియనున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఎన్‌డీటీవీ వివరించింది. దీంతో గడువుకంటే ముందుగానే ఆర్‌ఆర్‌పీఆర్‌లో వీసీపీఎల్‌ వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతి తప్పనిసరిగా తెలియజేసింది. మంగళవారం వీసీపీఎల్‌ ద్వారా ఎన్‌డీటీవీలో 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. దీంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఓపెన్‌ ఆఫర్‌ను సైతం ప్రకటించిన విషయం విదితమే.  

వారెంట్ల నిబంధనలు కీలకం
ఎన్‌డీటీవీ బలవంతపు టేకోవర్‌కు అదానీ గ్రూప్‌ చేస్తున్న ప్రయత్నాలలో వారెంట్ల జారీలో చోటుచేసుకున్న నిబంధనలు కీలకంగా నిలవనున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూప్‌నకు చెందిన వీసీపీఎల్‌ నుంచి వారెంట్ల జారీ ద్వారా ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ గతంలో దాదాపు రూ. 404 కోట్ల రుణాలు పొందింది. వీటిని ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్‌ఆర్‌పీఆర్‌లో 99.9 శాతం వాటాను పొందినట్లు అదానీ గ్రూప్‌ తెలియజేసింది. వెరసి ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ప్రమోటర్లకు ఈ విషయం తెలియదంటూ ఎన్‌డీటీవీ పేర్కొంది. దీంతో వారెంట్ల జారీలో అంగీకరించిన నిబంధనలు ఇకపై కీలక పాత్ర పోషించనున్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.  

రేటింగ్‌పై ఎఫెక్ట్‌...
బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా భారీగా విస్తరిస్తోంది. అయితే రుణాల ద్వారా చేపడుతున్న ఈ కొనుగోళ్లు కంపెనీ రేటింగ్‌పై ఒత్తిడిని పెంచుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజాగా పేర్కొంది. 1988లో కమోడిటీల ట్రేడర్‌గా ప్రారంభమైన గ్రూప్‌ మైనింగ్, పోర్టులు, విద్యుత్‌ ప్లాంట్లు, విమానాశ్రయాలు తదితర పలు రంగాలలో భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇటీవలే సిమెంట్‌ రంగంలో 10.5 బిలియన్‌ డాలర్ల విలువైన కొనుగోళ్లకు తెరతీసింది.

మరిన్ని వార్తలు