ఐపీఓకి మరో మూడు కంపెనీలు, కళకళలాడుతున్న మార్కెట్లు

23 Jun, 2021 08:40 IST|Sakshi

సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ క్లీస్‌ సైన్స్, శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ జీఆర్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ సైతం  

న్యూఢిల్లీసెకండరీ మార్కెట్ల జోరుతో గత కొంత కాలంగా పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. దీంతో ఇటీవల ప్రైమరీ మార్కెట్లు సైతం కళకళలాడుతున్నాయి. తాజాగా మరో మూడు కంపెనీలు ఇన్వెస్టర్లను పలుకరించనున్నాయి. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతిని పొందాయి. ఈ జాబితాలో క్లీన్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, శ్రీరామ్‌ ప్రాపర్టీస్, జీఆర్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ చేరాయి. వివరాలు ఇలా.. 

పబ్లిక్‌ ఇష్యూకి అనుమతించమంటూ ఏప్రిల్‌లోనే మూడు కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ సంస్థ క్లీన్‌సైన్స్‌కు ఈ నెల 12న, రియల్టీ సంస్థ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌కు 15న, మౌలిక సదుపాయాల కంపెనీ జీఆర్‌ ఇన్‌ఫ్రాకు 16న సెబీ దాదాపు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కాగా.. ఐపీవో ద్వారా క్లీన్‌సైన్స్‌ రూ. 1,400 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఆఫర్‌లో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు, వాటాదారులు ఈక్విటీని విక్రయించనున్నారు. పెర్‌ఫార్మెన్స్, ఎఫ్‌ఎంసీజీ కెమికల్స్, ఫార్మాస్యూటికల్‌ ఇంటర్మీడియెట్స్‌ తదితరాలను రూపొందిస్తోంది.  

రూ. 800 కోట్లకు సై 

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా బెంగళూరు సంస్థ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ రూ. 800 కోట్లను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు రూ. 550 కోట్ల ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నాయి. దీనికి అదనంగా రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. జాబితాలో టీపీజీ క్యాపిటల్, టాటా క్యాపిటల్, వాల్టన్‌ స్ట్రీట్‌ క్యాపిటల్‌ తదితర సంస్థలున్నాయి. కంపెనీ ఈక్విటీలో 58 శాతం వా టా వరకూ కలిగి ఉన్నాయి. దీంతో ఐపీవో నిధుల లో ప్రధాన భాగం పెట్టుబడి సంస్థలకు చేరనున్నా యి. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్ర ధానంగా దక్షిణాదిలో పలు ప్రాజెక్టులు చేపట్టింది.

రూ. 1,000 కోట్ల అంచనా 

ఉదయ్‌పూర్‌ ఈపీసీ కంపెనీ జీఆర్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ ఐపీవో ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఆఫర్‌లో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు 1.15 కోట్ల షేర్లకుపైగా విక్రయానికి ఉంచనున్నాయి. వాటాలు విక్రయించనున్న సంస్థలలో లోకేష్‌ బిల్డర్స్, జాసమ్రిత్‌ ప్రెమిసెస్, ఫ్యాషన్స్, క్రియేషన్స్, ఇండియా బిజినెస్‌ ఎక్సలెంట్‌ ఫండ్‌ తదితరాలున్నాయి. జాతీయ రహదారి ప్రాజెక్టులు చేపట్టే ఈ సంస్థ ఇటీవల రైల్వే రంగ ప్రాజెక్టులలోకీ ప్రవేశించింది.

చదవండి: ఇండియన్‌ బ్యాంక్‌ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం

 

మరిన్ని వార్తలు