ఐఆర్‌ఆర్‌ఏ ఏర్పాటుకు అక్టోబర్‌ డెడ్‌లైన్‌

31 Dec, 2022 06:05 IST|Sakshi

ఎక్సే్చంజీలకు సెబీ సూచన

న్యూఢిల్లీ: ట్రేడింగ్‌ మెంబర్ల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడితే ఇన్వెస్టర్లకు సహాయ సహకారాలు అందించేందుకు తగు వేదికను ఏర్పాటు చేయాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఇందులో భాగంగా విస్తృత చర్చలు జరిపిన అనంతరం 2023 అక్టోబర్‌ 1లోగా ఇన్వెస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ యాక్సెస్‌ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తేవాలని స్టాక్‌ ఎక్సే్చంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లకు  శుక్రవారం జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో సూచించింది. ట్రేడింగ్‌ మెంబర్స్‌ సిస్టమ్స్‌లో తరచూ సాంకేతిక లోపాలు వస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఓపెన్‌ పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు వాటిని క్లోజ్‌ చేయలేక నష్టపోవాల్సి వస్తోంది.

ఇలాంటప్పుడు ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను స్క్వేర్‌ ఆఫ్‌ చేసేందుకు, పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను రద్దు చేసేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ఉపయోగపడనుంది. సర్క్యులర్‌ ప్రకారం ఐఆర్‌ఆర్‌ఏ సర్వీసుల వ్యవస్థను ఎక్సే్చంజీలు రూపొందిస్తాయి. సాంకేతిక లోపాలకు గురైన ట్రేడింగ్‌ మెంబరు (టీఎం) .. ఈ సర్వీసులను అందించాల్సిందిగా ఎక్సేంజీలను అభ్యర్ధించాల్సి ఉంటుంది. ఐఆర్‌ఆర్‌ఏ సర్వీసును ఆథరైజ్‌ చేసిన తర్వాత సదరు టీఎం ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను పరిష్కరించుకోవచ్చు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాక తిరిగి టీఎం సిస్టమ్‌ ద్వారా ట్రేడింగ్‌ యథాప్రకారం కొనసాగుతుంది. అంతకు ముందు ఐఆర్‌ఆర్‌ఏ ద్వారా జరిగిన లావాదేవీల వివరాలన్నీ టీఎం సిస్టమ్‌లో ప్రతిఫలిస్తాయి. 

మరిన్ని వార్తలు