శారదా గ్రూప్‌ ఆస్తుల వేలం

14 Mar, 2023 04:10 IST|Sakshi

రిజర్వ్‌ ధర రూ. 32 కోట్లు

ఏప్రిల్‌ 11న ఈవేలం నిర్వహణ

న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా చిట్‌ ఫండ్‌ తదితర అక్రమ పథకాలను నిర్వహించిన శారదా గ్రూప్‌ ఆస్తులను వేలం వేయనున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఏప్రిల్‌ 11న నిర్వహించనున్న వేలానికి రూ. 32 కోట్ల రిజర్వ్‌ ధరను నిర్ణయించింది. ఆస్తులలో కంపెనీకి చెందిన పశ్చిమ బెంగాల్‌లోని భూములు న్నట్లు సెబీ నోటీసులో ప్రకటించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 మధ్య ఈవేలం నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఆస్తుల అమ్మకంలో సహకరించేందుకు క్వికార్‌ రియల్టీని, ఈవేలం నిర్వహణకు సీ1 ఇండియాను ఎంపిక చేసుకుంది.

శారదా గ్రూప్‌ ఆస్తుల వేలానికి 2022 జూన్‌లో కోల్‌కతా హైకోర్టు అనుమతించడంతో సెబీ తాజా చర్యలకు దిగింది. మూడు నెలల్లోగా ప్రక్రియను ముగించవలసిందిగా కోర్టు ఆదేశించింది. శారదా గ్రూప్‌ 239 ప్రయివేట్‌ కంపెనీల కన్సార్షియంగా ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్, అస్సామ్, ఒడిషాలలో కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా చిట్‌ ఫండ్‌ బిజినెస్‌ను చేపట్టింది. 2013 ఏప్రిల్‌లో మూతపడటానికి ముందు 17 లక్షల మంది కస్టమర్ల ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించింది. ముందుగానే శారదా గ్రూప్‌ ఆస్తులకు సంబంధించి సొంతంగా వివరాలు తెలుసుకోవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. తదుపరి వేలంలో బిడ్స్‌ దాఖలు చేసుకోమని సూచించింది.

మరిన్ని వార్తలు