మేహుల్‌ చోక్సీపై సెబీ నిషేధం

1 Nov, 2022 05:57 IST|Sakshi

10 ఏళ్లపాటు మార్కెట్లకు దూరం

రూ. 5 కోట్ల జరిమానా విధింపు

న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త మేహుల్‌ చోక్సీపై క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పదేళ్ల నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా 45 రోజుల్లోగా చెల్లించమని ఆదేశిస్తూ రూ. 5 కోట్ల జరిమానా సైతం విధించింది. గీతాంజలి జెమ్స్‌ కౌంటర్లో అక్రమ లావాదేవీలు చేపట్టిన అభియోగాలపై సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. దీంతో సెక్యూరిటీల మార్కెట్లో చోక్సీ పదేళ్లపాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి లావాదేవీలు చేపట్టేందుకు వీలుండదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గీతాంజలి జెమ్స్‌ షేర్ల ట్రేడింగ్‌లో ఇన్‌సైడర్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి చోక్సీపై సెబీ ఏడాది కాలం నిషేధాన్ని, రూ. 1.5 కోట్ల జరిమానాను విధించింది.

ఇక 2020 ఫిబ్రవరిలో లిస్టింగ్‌ తదితర పలు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ రూ. 5 కోట్ల జరిమానా చెల్లించవలసిందిగా చోక్సీతోపాటు, గీతాంజలి జెమ్స్‌ను సెబీ ఆదేశించింది. గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్, చైర్మన్‌ చోక్సీ నీరవ్‌ మోడీకి మేనమావకాగా.. వీరిరువురిపైనా పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను రూ. 14,000 కోట్లకుపైగా మోసం చేసిన కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2018 మొదట్లో పీఎన్‌బీ మోసం బయటపడిన తొలినాళ్లలోనే చోక్సీ, మోడీ విదేశాలకు తరలిపోయారు. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాలలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వెలువడగా.. ఇండియాకు అప్పగించాలన్న ప్రభుత్వ వాదనను బ్రిటిష్‌ జైల్లో ఉన్న మోడీ వ్యతిరేకిస్తున్నారు.

మరిన్ని వార్తలు