స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నారా?

12 Oct, 2022 07:00 IST|Sakshi

న్యూఢిల్లీ: పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని, తగినంత శ్రద్ధ చూపించాలని సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ సూచించారు. మార్కెట్‌ వదంతుల ఆధారంగా పెట్టుబడులు పెట్టొద్దని హితవు పలికారు. 

సెబీ వద్ద నమోదైన మధ్యవర్తుల ద్వారానే వ్యవహారాలు నిర్వహించాలని కోరారు. వరల్డ్‌ ఇన్వెస్టర్స్‌ వీక్‌ (10 నుంచి 16వ తేదీ వరకు) సందర్భంగా సెబీ వెబ్‌సైట్‌లో తన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఇన్వెస్టర్లు తమకుంటూ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, తమ ఆర్థిక లక్ష్యాలకు సరిపోలే పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, భిన్నమైన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ప్రాథమిక సూత్రాల్లో భాగమన్నారు.

మన మార్కెట్ల విస్తృతి ఎంతో పెరిగిందని గుర్తు చేస్తూ.. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో పెద్ద ఎత్తున అవగాహన, రక్షణ గురించి తెలియజేయడం తప్పనిసరి అని బుచ్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రక్రియలను సులభతరం చేశామని, అన్ని రకాల విషయాలను ఎప్పటికప్పుడు మార్కెట్లకు వెల్లడించేలా చేశామని చెప్పారు.  

మరిన్ని వార్తలు