Mutual Funds: బ్యాంక్‌ అకౌంట్లపై సెబీ కీలక ఉత్తర్వులు

7 Aug, 2021 07:31 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో తగినన్ని కరెంటు ఖాతాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు నిర్వహించాలని సెబీ కోరింది. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను స్వీకరించేందుకు.. అదే విధంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులను తిరిగి చెల్లించేందుకు, డివిడెండ్‌ చెల్లింపులు సులభంగా ఉండేందుకే సెబీ ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నుంచి వచ్చిన అభ్యర్థనకు వీలుగా ఈ మేరకు వివరణ ఇస్తున్నట్టు సెబీ స్పష్టం చేసింది. తప్పనిసరిగా బ్యాంకుల్లో తగినన్ని కరెంటు ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన బ్యాంకును ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుందని.. దీనివల్ల వేగంగా నిధుల బదిలీకి వీలు పడుతుందని తెలిపింది.

క్రెడిట్‌ సదుపాయాలను (నగదు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో) వినియోగించుకున్న కస్టమర్లకు కరెంట్‌ ఖాతాలను తెరవొద్దంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిన విషయాన్ని ఫండ్స్‌ పరిశ్రమ సెబీ దృష్టికి తీసుకెళ్లింది. అయితే, ఆ తర్వాత సమీక్షలో భాగంగా.. నూతన ఫండ్‌ పథకాలు, డివిడెండ్‌ చెల్లింపులు, షేర్ల బైబ్యాక్‌ తదితరాలకు ఖాతాలు తెరవొచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేయడం గమనార్హం.  

నిబంధనల అమలుకు మరింత గడువు 
బ్యాంకులు కరెంట్‌ ఖాతాలకు సంబంధించి మార్పులను అమలు చేసేందుకు ఈ ఏడాది అక్టోబర్‌ వరకు గడువును ఆర్‌బీఐ పొడిగించింది. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో కరెంట్‌ ఖాతాల స్తంభనతో చిన్న వ్యాపార సంస్థలు ఇబ్బంది పడుతున్నట్టు తెలియడంతో ఆర్‌బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. రుణాల పరంగా రుణ గ్రహీతల్లో క్రమశిక్షణను పెంచడం, రుణాలపై బ్యాంకుల నుంచి మరింత పర్యవేక్షణకు వీలుగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు తెలిపింది. వ్యాపార సంస్థల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వాటి కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిబంధనలను ఆచరణలో పెట్టాలని కోరింది.

మరిన్ని వార్తలు