సబ్‌స్క్రైబర్‌లతో టెలిగ్రామ్‌ కుంభకోణం!! కేసు, సెబీ సోదాలు

11 Mar, 2022 14:38 IST|Sakshi

న్యూఢిల్లీ: మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ను వినియోగించుకుని షేర్ల ట్రేడింగ్‌ సంబంధ కుంభకోణానికి తెరతీశాయన్న ఆరోపణలున్న సంస్థలపై క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ తాజగా సోదాలకు దిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎనిమిది సంస్థలకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు, స్వాదీన చర్యలను చేపట్టింది. 

ఈ సంస్థలు తొమ్మిది టెలిగ్రామ్‌ చానళ్ల నిర్వహణ ద్వారా 50 లక్షలకుపైగా సబ్‌స్కయిబర్లకు రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్‌ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు వీటిలో లావాదేవీలు చేపట్టేలా చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ఆయా కౌంటర్లలో కృత్రిమంగా లావాదేవీల పరిమాణం, ధరల పెరుగుదలకు దారిచూపినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వీటితో లింక్‌ చేసిన సంస్థలు అధిక ధరల వద్ద షేర్లను విక్రయించేందుకు వీలు కల్పించాయి.  తద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లు నష్టపోగా.. ఈ సంస్థలు లబ్ది పొందినట్లు తెలుస్తోంది.

ఈ అక్రమాలకు సంబంధించి తాజాగా ఏడుగురు వ్యక్తులు, ఒక కార్పొరేట్‌ సంస్థకు చెందిన పలు ప్రాంతాలలో సోదాలు, స్వాధీన చర్యలు చేపట్టినట్లు సెబీ వెల్లడించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, భావనగర్, మధ్యప్రదేశ్‌లోని నీముచ్, ఢిల్లీ, ముంబైలలో సోదాలు జరిగినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సెబీ అధికారులు 34 మొబైల్‌ ఫోన్లు, 6 ల్యాప్‌టాప్‌లు, 4 డెస్క్‌టాప్‌లు, 4 ట్యాబ్లెట్లతోపాటు.. 2 హార్డ్‌ డిస్కులు, పలు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు