వెబ్‌సైట్ల నిర్వహణ తప్పనిసరి.. సెబీ ఆదేశాలు

17 Feb, 2023 07:52 IST|Sakshi

న్యూఢిల్లీ: పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్టాక్‌ బ్రోకర్లు, డిపాజిటరీలకు వెబ్‌సైట్ల నిర్వహణను తప్పనిసరి చేసింది. తద్వారా స్టాక్‌ బ్రోకర్లు(ఎస్‌బీలు), డిపాజిటరీ పార్టిసిపెంట్లు(డీపీలు) చేపట్టే వివిధ లావాదేవీ(యాక్టివిటీ)ల సమాచారం ఇన్వెస్టర్లకు పారదర్శకంగా అందుబాటులోకి రానుంది. ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో సంబంధిత వెబ్‌సైట్లను ఎస్‌బీ, డీపీలు తప్పనిసరిగా నిర్వహించవలసి ఉంటుంది.

వెరసి ఇన్వెస్టర్లకు ఉత్తమ సర్వీసులు అందించేందుకు వీలుంటుంది. ఆయా వెబ్‌సైట్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ నంబర్, రిజిస్టరైన చిరునామా, ప్రధాన కేంద్రం, బ్రాంచీలు, కాంటాక్టుకు వీలయ్యే పేర్లు, ఈమెయిల్‌ ఐడీలు తదితర ప్రాథమిక సమాచారంతోపాటు కీలక యాజమాన్యం, కంప్లయెన్స్‌ అధికారుల వివరాలు సైతం పొందుపరచవలసి ఉంటుందని తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది.

తాజా మార్గదర్శకాలు ఆగస్ట్‌ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలియజేసింది. ఈ సర్క్యులర్‌ అమల్లోకి వచ్చిన వారంలోగా ఎస్‌బీలు, డీపీలు వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌(లింక్‌)ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు నివేదించవలసి ఉంటుందని సర్క్యులర్‌లో సెబీ స్పష్టం చేసింది. యూఆర్‌ఎల్‌లో సవరణలు చేపడితే మూడు రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది.

(ఇదీ చదవండి: వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు)

మరిన్ని వార్తలు