ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు సెబీ షాక్‌.. భారీ జరిమానా

8 Jun, 2021 13:26 IST|Sakshi

    కొత్త స్కీములపై రెండేళ్ల నిషేధం

న్యూఢిల్లీ: గతేడాది ఆరు డెట్‌ పథకాలను నిలిపివేసిన అంశానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఏఎంసీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకిచి్చంది. రూ. 5 కోట్ల జరిమానా విధించింది. రెండేళ్ల పాటు కొత్త స్కీములేమీ ప్రవేశపెట్టకుండా నిషేధం విధించింది. అలాగే, పెట్టుబడుల నిర్వహణ, అడ్వైజరీ ఫీజులకు సంబంధించి వడ్డీతో సహా రూ. 512 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లకు వాపసు చేయాలని సెబీ ఆదేశించింది.

మరోవైపు సాధారణ ప్రజానీకానికి ఇంకా వెల్లడి కాని వివరాలు తమ దగ్గర ఉండగా.. ఫండ్‌లో తమకున్న యూనిట్లను విక్రయించుకున్నందుకు గాను సంస్థ ఏషియా పసిఫిక్‌ మాజీ హెడ్‌ వివేక్‌ కుద్వా, ఆయన భార్య రూపా కుద్వాపైనా సెబీ చర్యలు తీసుకుంది. వారిద్దరికి మొత్తం రూ. 7 కోట్ల జరిమానాతో పాటు ఏడాది కాలం.. సెక్యూరిటీ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది. ఫండ్స్‌ యూనిట్ల అమ్మకం ద్వారా వారు అందుకున్న రూ. 22.64 కోట్ల మొత్తాన్ని 45 రోజుల్లోగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా సెబీ ఆదేశించింది.  

>
మరిన్ని వార్తలు