ముకేశ్‌ అంబానీపై రూ.15 కోట్ల జరిమానా

2 Jan, 2021 03:38 IST|Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై రూ.25 కోట్లు 

రిలయన్స్‌ పెట్రోలియమ్‌ లిమిటెడ్‌ కేసులో సెబీ వడ్డింపు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీపై  సెబీ రూ.15 కోట్ల జరిమానా విధించింది. ముకేశ్‌ అంబానీతో పాటు ఆయన సీఎమ్‌డీగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్, మరో రెండు సంస్థలపై కూడా సెబీ జరిమానాలు వడ్డించింది. 2007, నవంబర్‌లో రిలయన్స్‌ పెట్రోలియమ్‌ లిమిటెడ్‌(ఆర్‌పీఎల్‌) షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలకు  సంబంధించిన కేసులో ఈ మేరకు జరిమానాలను సెబీ విధించింది.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.25 కోట్లు, నవీ ముంబై సెజ్‌ ప్రైవేట్‌  లిమిటెడ్‌ రూ.20 కోట్లు, ముంబై సెజ్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్ల మేర జరిమానాలు చెల్లించాలని సెబీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ తాజా సెబీ ఆదేశాలపై  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇంకా స్పందించలేదు.  

షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలు: ఆర్‌పీఎల్‌లో 4.1% వాటాను విక్రయించాలని 2007, మార్చిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది. అదే ఏడాది నవంబర్‌లో ఆర్‌పీఎల్‌ షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి నగదు, ఫ్యూచర్‌ సెగ్మెంట్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆర్‌పీఎల్‌లో తన వాటా షేర్ల విక్రయానికి సంబంధించి లావాదేవీల ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అవకతవకలకు పాల్పడిందని  సెబీ అడ్జుడికేటింగ్‌ ఆఫీసర్‌ బి.జె. దిలిప్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు