10 కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌!

30 Nov, 2021 08:53 IST|Sakshi

జాబితాలో జెమినీ ఎడిబుల్స్, ఎలక్ట్రానిక్‌ మార్ట్‌ ఇండియా 

న్యూఢిల్లీ: జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా (ఫ్రీడమ్‌ బ్రాండ్‌ వంట నూనెల కంపెనీ), బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా, రక్షణ పరికరాల సంస్థ డేటా ప్యాటర్న్స్‌ ఇండియా, డిజిటల్‌ మ్యాపింగ్‌ సేవల్లోని మ్యాప్‌మై ఇండియా ఐపీవోలకు సెబీ నుంచి పరిశీలన పత్రాలు (ఆమోదం) లభించాయి. ఐపీవో చేపట్టేందుకు ఆమోదం లభించిన ఇతర సంస్తల్లో ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్, ఇండియా1 పేమెంట్స్, హెల్తియమ్‌ మెడ్‌టెక్, వీఎల్‌సీసీ హెల్త్‌కేర్, మెట్రోబ్రాండ్స్, గోదావరి బయో రిఫైనరీస్‌ ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్‌–సెప్టెంబర్‌లో ఈ కంపెనీలు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేయగా.. పరిశీలనల పత్రం గడిచిన వారం రోజుల్లో జారీ చేసినట్టు సెబీ వెబ్‌సైట్‌ సమాచారం తెలియజేస్తోంది. పరిశీలనల పత్రం జారీ అయితే ఐపీవో చేపట్టేందుకు అనుమతి లభించినట్టుగా పరిగణిస్తారు.  
∙జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా రూ.2,500 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించనుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఈ షేర్లను విక్రయించనున్నారు. కనుక ఐపీవో రూపంలో కంపెనీకి రూపాయి కూడా వెళ్లదు. 
∙డేటా ప్యాటర్న్స్‌ ఇండియా రక్షణ రంగానికి ఎలక్ట్రానిక్‌ పరికరాలను సరఫరా చేస్తుంటుంది. ఈ సంస్థ తాజా షేర్ల జారీ ద్వారా రూ.300 కోట్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో 60,70,675 షేర్లను విక్రయించనుంది. 
∙మ్యాప్‌ మై ఇండియా (సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌)లో క్వాల్‌కామ్, జపాన్‌ డిజిటల్‌ మ్యాపింగ్‌ కంపెనీ జెన్‌రిన్‌కు వాటాలున్నాయి. ఇవి సైతం తమ వాటాలను ఐపీవోలో విక్రయించనున్నాయి.                                     
∙ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ రూ.800 కోట్లను, ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా రూ.500 కోట్లను ఐపీవో రూపంలో సమీకరించనున్నాయి.  
∙హెల్తియమ్‌ మెడ్‌టెక్‌ సంస్థ తాజాగా రూ.390 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. అలాగే, ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో 3.91 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. 
∙వీఎల్‌సీసీ హెల్త్‌కేర్‌ రూ.300 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండగా.. మరో 89 లక్షల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు అమ్మకానికి పెట్టనున్నారు.
 

మరిన్ని వార్తలు