పెండింగ్‌లో గో ఎయిర్‌

29 Jun, 2021 10:39 IST|Sakshi

నిర్ణయాన్ని పక్కనపెట్టిన సెబీ 

మే నెలలో ప్రాస్పెక్టస్‌ దాఖలు      

రూ. 3,600 సమీకరణ లక్ష్యం 

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు గత నెలలో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినప్పటికీ గో ఎయిర్‌లైన్స్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఇంకా క్లియరెన్స్‌ లభించలేదు. రూ. 3,600 కోట్ల సమీకరణకు వీలుగా మే నెలలోనే గో ఎయిర్‌ సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ అప్లికేషన్‌పై నిర్ణయాన్ని సెబీ పక్కనపెట్టింది. ప్రాస్పెక్టస్‌ దాఖలు సమయంలో గో ఫస్ట్‌గా రీబ్రాండింగ్‌ చేసుకున్నట్లు గో ఎయిర్‌లైన్స్‌ (ఇండియా) లిమిటెడ్‌  ప్రకటించింది.
 

ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు దరఖాస్తులో పేర్కొంది. కాగా.. గో ఎయిర్‌లైన్స్‌ ఆఫర్‌ డాక్యుమెంట్ల ప్రాసెసింగ్‌పై నిర్ణయాన్ని సెబీ పక్కనపెట్టింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవో ప్రాస్పెక్టస్‌లను ప్రాసెస్‌ చేసేందుకు కేసులను బట్టి 30, 45, 90 రోజులు లేదా అంతకుమించిన సమయాన్ని తీసుకునేందుకు సెబీకి వీలుంది. గో ఎయిర్‌ ప్రాస్పెక్టస్‌పై సెబీ ఈ నెల 11న లీడ్‌ మేనేజర్‌ను వివరణలు కోరింది. అయితే ప్రాస్పెక్టస్‌పై నిర్ణయాన్ని నిలుపుదల చేసిన కారణాలు వెల్లడికావలసి ఉంది. కంపెనీలో వాడియా గ్రూప్‌నకు 73.33 శాతం వాటా ఉంది.

30 రోజుల్లోగా 
సాధారణంగా సెబీ ఐపీవో దరఖాస్తులపై 30 రోజుల్లోగా నిర్ణయాలు వెల్లడిస్తుంటుంది. అయితే కొన్ని కేసులలో షోకాజ్‌ నోటీసులు జారీ కాకుంటే పరిశోధన చేపట్టడం లేదా దర్యాప్తు జరుగుతుండటం వంటి అంశాల కారణంగా మరో 30 రోజులపాటు నిర్ణయాన్ని వాయిదా వేస్తుంది. తదుపరి మరో 30 రోజుల్లోగా దర్యాప్తును పూర్తిచేసేందుకు వీలుంటుంది. ఒకవేళ షోకాజ్‌ నోటీసులను జారీ చేస్తే 90 రోజులపాటు నిర్ణయాన్ని పక్కనపెట్టడంతోపాటు.. మరో 45 రోజులలోగా ప్రొసీడింగ్స్‌ను పూర్తిచేస్తుంది. 

చదవండి: వాయిస్‌ బీపీవో హబ్‌గా భారత్‌..

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు