మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి!

29 Apr, 2022 11:22 IST|Sakshi

లక్నో: మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీని సహారా ఇండియా పరివార్‌ ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించింది. సహారాకు చెందిన రూ.25,000 కోట్లు ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అందులో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో కేవలం రూ.125 కోట్లనే ఇన్వెస్టర్లకు చెల్లిందని పేర్కొంది. మిగిలిన డబ్బును ఎందుకు చెల్లించలేకపోతోందని ప్రశ్నించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బాధిత కంపెనీగా సహారా మిగులుతోందని విమర్శించింది. అక్రమంగా వసూలు చేశారంటూ తమ వద్ద నుంచి డిపాజిట్‌ చేయించుకున్న రూ.25,000 కోట్లను ఇన్వెస్టర్లు అందరికీ చెల్లింపులు చేయాలని లేదా ఆ మొత్తాలను తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేసింది.

తద్వారా తామే తమ డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించుకుంటామని స్పష్టం చేసింది. సెబీ వద్ద సహారా డబ్బు డిపాజిట్‌కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు అసలు లక్ష్యం నెరవేరడం లేదని పేర్కొంది.

మరిన్ని వార్తలు