కార్వీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై సెబీ రూ. 10 లక్షల జరిమానా

30 Jul, 2021 01:03 IST|Sakshi

న్యూఢిల్లీ: రీగాలియా రియాలిటీ లిమిటెడ్‌ సంస్థలో షేర్లను కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించే విషయంలో జాప్యం చేసినందుకు గాను కార్వీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 10 లక్షల జరిమానా విధించింది. నిర్దేశిత వ్యవధిలోగా తప్పనిసరిగా ప్రకటించకపోవడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అందుకే జరిమానా విధించామని సెబీ పేర్కొంది. వివరాల్లోకి వెడితే రీగాలియా ప్రమోటర్లు 55.56 శాతం వాటాలను తనఖా పెట్టి కార్వీ నుంచి రూ. 7 కోట్లు రుణం తీసుకున్నారు.

రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను కార్వీ స్వాధీనం చేసుకుంది. దీంతో రీగాలియాలో కార్వీ వాటాలు సెబీ నిర్దేశిత స్థాయికి మించి 55.56 శాతానికి చేరాయి. ఫలితంగా పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల నుంచి షేర్ల కొనుగోలుకు 45 రోజుల్లోగా ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాలని సెబీ ఆదేశించింది. దీనిపై సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌)ని ఆశ్రయించినప్పటికీ కార్వీకి చుక్కెదురైంది. సెబీని సమర్థిస్తూ 2018 ఏప్రిల్‌లో శాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన 45 రోజుల్లోగా కార్వీ బహిరంగ ప్రకటన చేయాల్సింది. కానీ 81 రోజుల తర్వాత 2018 ఆగస్టులో కార్వీ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటన చేసింది. ఇది నిబంధనల ఉల్లంఘన కింద భావిస్తూ సెబీ తాజాగా జరిమానా విధించింది. 

మరిన్ని వార్తలు