SEBI: మరిన్ని పటిష్ట చర్యలకు సెబీ రెడీ

30 Jun, 2021 08:22 IST|Sakshi

బోర్డు సమావేశంలో తాజా నిర్ణయాలు  

ఇన్వెస్టర్లను ఆకట్టుకునే పలు చర్యలు 

స్వతంత్ర డైరెక్టర్ల ఎంపికలో ఇన్వెస్టర్లకు పాత్ర   

ముంబై: కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను పటిష్ట పరచడం, స్టాక్‌ మార్కెట్లలోకి మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించడం, స్వతంత్ర డైరెక్టర్ల నిబంధనలను కఠినతరం చేయడం, ఆర్‌ఈఐటీలకు కనీస సబ్‌స్క్రిప్షన్‌ను తగ్గించడం వంటి పలు చర్యలను వార్షిక సమావేశం సందర్భంగా సెబీ బోర్డు ఆమోదించింది. ఈ బాటలో గత ఆర్థిక సంవత్సర(2020–21) వార్షిక నివేదికను ఆమోదించింది. ఇతర వివరాలు చూద్దాం..  

  • పబ్లిక్‌ ఇష్యూ, రైట్స్‌ ఇష్యూలలో ఇన్వెస్టర్ల పార్టిసిషేషన్‌ను పెంచేందుకు వీలుగా విభిన్న చెల్లింపులకు అనుమతి. ఈ ఇష్యూలకు షెడ్యూల్డ్, నాన్‌షెడ్యూల్డ్‌ బ్యాంకులను బ్యాంకర్లుగా వ్యవహరించేందుకు గ్రీన్‌సిగ్నల్‌.  
  • స్వతంత్ర డైరెక్టర్ల ఎంపిక, పునర్నియామకం, తొలగించడం తదితర అంశాల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ అంశాలలో ఇక పబ్లిక్‌ వాటాదారులకూ పాత్ర. 2022 జనవరి 1 నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి.  
  • రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(ఇన్విట్స్‌) మరిన్ని పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వెసులుబాటు. ఇందుకు వీలుగా కనీస సబ్‌స్క్రిప్షన్, కనీస లాట్‌ పరిమాణం కుదింపు. కనీస పెట్టుబడి రూ. 10,000–15,000, ఒక యూనిట్‌తో ట్రేడింగ్‌ లాట్‌. ప్రస్తుతం ఇవి రూ. 1,00,000–50,000గా ఉన్నాయి. 100 యూనిట్లు ఒక లాట్‌గా అమలవుతోంది. 
  • అక్రిడెటెడ్‌ ఇన్వెస్టర్లకు మార్గదర్శకాలు. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడక్టులపట్ల మంచి అవగాహన కలిగిన వారిని అక్రిడెటెడ్‌ ఇన్వెస్టర్లుగా వర్గీకరణ. ఈ జాబితాలో ఆర్థిక అంశాల ఆధారంగా వ్యక్తులు, కుటుంబ ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, ప్రొప్రయిటర్‌షిప్స్, పార్టనర్‌షిప్‌ సంస్థలు, ట్రస్టులు, కార్పొరేట్‌ బాడీలు చేరనున్నాయి.  
  • అన్‌లిస్టెడ్‌ ఇన్విట్స్‌లో యూనిట్లు కలిగిన కనీసం ఐదుగురు వాటాదారులు తప్పనిసరి. ఇన్విట్స్‌ మొత్తం మూలధనంలో వీరి ఉమ్మడి వాటా 25 శాతానికంటే అధికంగా ఉండాలి.
  • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల తరఫున దేశీ ఫండ్‌ మేనేజర్లు కార్యకలాపాలలో భాగంకావచ్చు.  
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి సమాచారం అందించేవారికి ప్రకటించే బహుమానం రూ. కోటి నుంచి రూ. 10 కోట్లవరకూ పెంపు. 

చదవండి: NITI Aayog: పన్ను మినహాయింపులకు నీతి ఆయోగ్‌ ఓటు

మరిన్ని వార్తలు