ఫోరెన్సిక్‌ ఆడిటర్లకు గడువు పెంపు

9 Mar, 2023 00:26 IST|Sakshi

ఈ నెలాఖరువరకూ దరఖాస్తుకు చాన్స్‌

న్యూఢిల్లీ: ఫోరెన్సిక్‌ ఆడిటర్లుగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి ఇప్పటికే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇలా ఎంపికైన ఆడిటర్లు మ్యూచువల్‌ ఫండ్స్, ఆస్తుల నిర్వహణ కంపెనీ(ఏఎంసీ)లు, ట్రస్టీ సంస్థలకు సేవలు అందించవలసి ఉంటుంది. అర్హతగల సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఇచ్చిన గడువు ఈ నెల 6తో ముగియగా.. తాజాగా మార్చి 31వరకూ సెబీ పొడిగించింది. దరఖాస్తుదారులు మొబైళ్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు తదితర యూఎస్‌బీ డ్రైవ్‌ల నుంచి సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం, డిజిటల్‌ ఎవిడెన్స్‌పై నివేదికలు రూపొందించడం తదితర కార్యకలాపాలు చేపట్టవలసి ఉంటుంది.  

బైబ్యాక్‌ బిడ్స్, ధరలపై సెబీ ఆంక్షలు
 స్టాక్‌ ఎక్సే్ఛంజీల ద్వారా చేపట్టే బైబ్యాక్‌లకు వర్తింపు
స్టాక్‌ ఎక్సే్ఛంజీల ద్వారా చేపట్టే సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)లో సెబీ తాజాగా ఆంక్షలు విధించింది. బిడ్స్‌ వేయడం, ధరల నిర్ణయం, పరిమాణం తదితర అంశాలకు ఆంక్షలు వర్తింపచేస్తూ సెబీ సర్క్యులర్‌ను జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకారం కొనుగోలు తేదీ నుంచి గత 10 ట్రేడింగ్‌ పనిదినాల రోజువారీ సగటు పరిమాణం(విలు వ)లో 25 శాతాన్ని మించి బైబ్యాక్‌ చేపట్టేందుకు వీలుండదు. మార్కెట్‌ ప్రారంభానికి ముందు తొలి అర్ధగంట, ట్రేడింగ్‌ సమయంలో చివరి అర్ధగంట లో బైబ్యాక్‌ బిడ్స్‌ను అనుమతించరు.

క్రితంరోజు ట్రేడైన ధరకు 1% శ్రేణిలో మాత్రమే ఆర్డర్లకు అను మతి ఉంటుంది. తాజా నిబంధనలను అమలు చేయవలసిందిగా అటు కంపెనీలు, ఇటు ఎంపిక చేసిన బ్రోకర్లను సెబీ ఆదేశించింది. నిబంధనల అమలును స్టాక్‌ ఎక్సే్ఛంజీలు పర్యవేక్షిస్తుంటాయని, ఉల్లంఘిస్తే జరిమానా లేదా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బైబ్యాక్‌ చేపట్టేందుకు స్టాక్‌ ఎక్సే్ఛంజీలు, టెండర్‌ ఆఫర్‌ మార్గా లు అందుబాటులో ఉన్నాయి. కాగా.. స్టాక్‌ ఎక్సే్ఛంజీల ద్వారా బైబ్యాక్‌ చేపట్టడాన్ని దశలవారీగా తొలగించనున్న సంగతి తెలిసిందే.  

ఈ నెలాఖరుకల్లా పాన్‌–ఆధార్‌ లింక్‌
ఇన్వెస్టర్లకు సెబీ తాజా ఆదేశాలు
సెబీ ఈ నెలాఖరులోగా ఆదాయ పన్ను శాఖ నుంచి పొందే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌) కు ఆధార్‌ను లింక్‌ చేయవలసిందిగా ఇన్వెస్టర్లను మరోసారి ఆదేశించింది. తద్వారా సెక్యూరిటీల మార్కెట్లో లావాదేవీలను ఎలాంటి సమస్యలూ లేకుండా నిర్వహించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. గడువులోగా పాన్‌కు ఆధార్‌ను లింక్‌ చేయని ఇన్వెస్టర్లను కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తామని పేర్కొంది. దీంతో సెక్యూరిటీలు, ఇతర లావాదేవీలపై ఆంక్షలు అమలుకానున్నట్లు వెల్లడించింది. 2023 మార్చి31లోగా ఆధార్‌ను లింక్‌ చేయకుంటే పాన్‌ సేవలు నిలిచిపోనున్నట్లు 2022 మార్చిలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక సర్క్యులర్‌ ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారం తగిన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేసింది.

మరిన్ని వార్తలు