డీమాట్‌ ఖాతాదారులకు ముఖ్య గమనిక..!

26 Jul, 2021 19:38 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు కచ్చితంగా డీమాట్‌ ఖాతాను కలిగి ఉండాలి. స్టాక్‌ మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ డీమాట్‌ ఖాతాలను ఓపెన్‌ చేయడానికి కొత్త నియమాలను తీసుకువచ్చింది. అక్టోబర్‌ 1 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి వస్తాయి. 

డీమాట్ ఖాతా కోసం సెబీ కొత్త నియమాలు

  • సెబీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అక్టోబర్ 1 నుంచి కొత్త ట్రేడింగ్, డీమాట్ ఖాతాలను తెరిచే పెట్టుబడిదారులు నామినేషన్ ఇవ్వడానికి లేదా నామినేషన్ నుంచి వైదొలగడానికి ఎంపిక ఉంటుంది.
  • తాజాగా సెబీ నామినేషన్ ఫారం ఫార్మట్‌ను విడుదల చేసింది. డీమాట్, ట్రేడింగ్ ఖాతా తెరిచేటప్పుడు పెట్టుబడిదారుడు నామినేషన్ చేయడానికి ఇష్టపడకపోతే ఇన్వెస్టర్‌ ఈ సమాచారాన్ని సెబీకి అందజేయాలి.

మీ డీమాట్‌ ఖాతా స్తంభింపజేస్తారు..!
మీ డీమాట్‌ ఖాతా స్తంభింపకుండా ఉండాలంటే ఇన్వెస్టర్‌ కచ్చితంగా 'డిక్లరేషన్ ఫారం' నింపాలి. మీకు డీమాట్ ఖాతా ఉంటే, మీరు మార్చి 31, 2022 లోపు నామినేషన్ ఫారమ్‌ను కూడా సమర్పించాలి. నామినేషన్‌ వద్దనుకుంటే అందుకు వేరే ఫారంను నింపాలి. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న అన్ని అర్హత కలిగిన ట్రేడింగ్, డీమాట్ ఖాతాదారులు 2022 మార్చి 31 నాటికి నామినేషన్ ఎంపికను అందించాల్సి ఉంటుంది. ఇది విఫలమైతే  ఆయా ఇన్వెస్టర్ల ట్రేడింగ్, డీమాట్ ఖాతాలను సెబీ స్తంభింపజేస్తుంది. నామినేషన్‌, డిక్లరేషన్‌ ఫారాలకు సాక్షులు అవసరం లేదు.

నామినీకి సంబంధించిన నియమాలు
కొత్త నిబంధనల ప్రకారం, డీమాట్, ట్రేడింగ్ ఖాతాదారులు చనిపోతే వారి ఖాతా వాటాలు ఎవరికి బదిలీ చేయాలో తెలియజేయవచ్చును. ఈ నామినేషన్ డీమాట్ ఖాతా తెరిచే సమయంలో మాత్రమే జరుగుతుంది. మీరు ఎప్పుడైనా నామినీ పేరు మార్చాలనుకుంటే, మార్చవచ్చును. మీరు ఎన్‌ఆర్‌ఐను కూడా  నామినీగా చేసుకోవచ్చు. కానీ డీమాట్ ఖాతాలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులను మాత్రమే  నామినీలుగా చేయవచ్చును. ఇద్దరు కంటే ఎక్కువ నామీనీలు ఉంటే ముందుగానే వారి వాటాలను పెట్టుబడిదారుడు నిర్ణయించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు